Sarvepalli Radhakrishnan vidyarthi mitra kits for govt schools in AP

వేసవి సెలవుల అనంతరం బడులు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు' పంపిణీ చేసేందుకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు కిట్లు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 20లోపు పంపిణీ పూర్తి చేయాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించింది. ఈ కిట్లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్, నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనీఫాం, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్ అందించనున్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు.

ఇప్పటికే దాదాపు 95 శాతం పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకావడంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటికే నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ అందించింది. ప్రతి విద్యార్థికి అందించే విద్యార్ధి మిత్ర కిట్పై ప్రభుత్వం సగటున రూ.2,279 ఖర్చు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు మొదటి సెమిస్టర్కు 1,67,81,374 పాఠ్యపుస్తకాలు అవసరం కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు దాదాపు 1,60,11,028 పుస్తకాలు ఆయా జిల్లా కేంద్రాలకు పంపించడం జరిగింది. మండలాలకు 1,59,24,360 చేరాయి. పాఠశాలలకు అన్ని వస్తువులు కలిపి కిట్గా అందించనున్నారు.2025-26 విద్యా సంవత్సరానికి 35,94,774 మంది విద్యార్థులకు కిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనికి రూ.953.71 కోట్లు ఖర్చు కానుంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఏకరూప దుస్తులకు కుట్టుకూలి కింద రూ.120 అందిస్తారు. ఇక 9, 10 తరగతుల వారికి రూ.240 చెల్లించనున్నారు. ఏకరూప దుస్తులను ఈ ఏడాది సరికొత్త రంగులో అందించనున్నారు. ఆలీవ్ గ్రీన్ ప్యాంట్-గౌను, లైట్ ఎల్లో, గ్రీన్ చారల చొక్కా అందించనున్నారు. ఇక ఆరో తరగతి విద్యార్థులకు ఆంగ్లం-ఆంగ్లం-తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అందించనున్నారు.

Politent News Web3

Politent News Web3

Next Story