Who is the mastermind behind MLC Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెనక ఎవరున్నారు? ఆమె సొంత నిర్ణయాలే వెనక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత సోదరుడిపైనే తిరుగుబాటు చేసేంత పరిస్థితి ఎందుకొచ్చిందన్న దానిపై బీఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు. కవిత వెనక ఏ పార్టీ నేతలు అయినా ఉన్నారా? లేక తమ పార్టీలో ఉన్న నేతలే బ్యాక్ ఉండి ప్రోత్సహిస్తున్నారన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ లీడర్ అన్నది అందరికీ దాదాపు రెండేళ్ల క్రితమే క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు కవిత బరస్ట్ అవ్వడానికి కారణాలు ఏంటన్న దానిపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా కేటీఆర్ కవిత ఇంటికి వెళ్లారు. అక్కడే ఉండి ఈడీ అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఇక కవిత తీహార్ జైలులో ఉన్న సమయంలో అనేక సార్లు ఢిల్లీ వెళ్లి కలసి వచ్చారు. న్యాయవాదులతోనూ బెయిల్ కోసం కేటీఆర్ హస్తినకు బయలుదేరి వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కేటీఆర్ అక్కడే ఉండి ఇంటికి తీసుకు వచ్చారు.

ఇంత బాగా ఉన్న అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గండి ఎక్కడ పడిందన్న దానిపైనే అందరికీ సందేహాలు తలెత్తుతున్నాయి. తీహార్ జైలులో ఉన్నప్పుడే బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, దానిని వ్యతిరేకించానని కవిత చెప్పే విషయం కూడా నమ్మశక్యంగా లేదంటున్నారు. కేసీఆర్ ఉద్యమ పార్టీగా పెట్టి తర్వాత దానిని జాతీయ పార్టీగా మార్చింది విలీనం చేయడానికి కాదు గదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. బీజేపీలో విలీనం చేస్తే కేసీఆర్ కు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థం కూడా కావడం లేదు. బీజేపీలో ఒక నాయకుడిగానే మారతారు. మహా అయితే కేంద్రంలో మంత్రిపదవి దక్కుతుంది. రాష్ట్రం వారి చేతుల్లో పెట్టడానికి ఏ ప్రాంతీయ పార్టీ నేత అయినా ఎందుకు మొగ్గు చూపుతారన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది. అందులోనూ బీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు ఉంది. అంతకు మించి కేసీఆర్ అనే శక్తి ఉంది. వీటన్నింటినీ కాదని కమలం పార్టీలో కలిపేయడానికి కేసీఆర్ ఏం రాజకీయ అనుభవం లేని నేత కాదు గదా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. కవిత తాను బయటకు వెళ్లడానికి సాకు చెబుతున్నారన్న అభిప్రాయం కూడా కార్యకర్తల్లో ఏర్పడింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది కేవలం రాజకీయ పదవుల కోసం కాదని, ఆస్తి విషయాలుకూడా అయి ఉండవచ్చన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే ఆ విషయం బయటకు చెప్పకుండా ఇలా బీజేపీలో విలీనం చేస్తారని బురద జల్లి బయటకు వెళ్లిపోవడానికి కవిత ఏమైనా ప్లాన్ వేశారా? అన్న అనుమానం అయితే అందరిలోనూ కలుగుతుంది. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి కవితతో మాట్లాడితే ఇవన్నీ సమసిపోతాయని అంటున్నప్పటికీ కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్ మాత్రం కంటిన్యూ అవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Politent News Web3

Politent News Web3

Next Story