సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా.. ఏ రైతును అడిగినా.. ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ అనే చెప్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన రైతురాజ్యం మీద, కాంగ్రెస్ తెచ్చిన రాబందుల రాజ్యం మీద చర్చించడానికి తాను సిద్ధమన్నారు. రైతుల పేరుతో రొటీన్ గా రంకెలు వేసిన రేవంత్ రెడ్డి ముచ్చట తీర్చడానికి ఆయన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు. అయితే బేసిన్లు, బెండకాయలని పరువు తీసుకోకుండా ఉండడానికి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నానని చెప్పారు. ప్లేస్, టైం, డేట్ డిసైడ్ చేసి చెప్పాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన నడవడం లేదన్న కేటీఆర్, చంద్రబాబు కోవర్డు రేవంత్ రెడ్డి పాలనే నడుస్తుందన్నారు. గురువు కోసం ఏపీకి తెలంగాణ నీళ్లను పారిస్తున్న రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్డే అని విమర్శించారు.

కేటీఆర్ కామెంట్స్

రైతులకు ఎవరు మంచి చేశారన్న దానిలో చర్చించడానికి,ఛాలెంజ్ లు చేసుకోవడానికి కొత్తగా ఏంలేదు. ముఖ్యమంత్రి ముచ్చట పడి రొటీన్ గా రంకెలు వేశారు. ఆయన ముచ్చట తీర్చడానికి నేను చర్చకు సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ అవసరం లేదు నేను సరిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు చర్చకు నేను రెడీ. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రిపేర్ కావడానికి టైం కావాలి. గతంలో కూడా ప్రిపేర్ అయ్యే రాలేదని కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారు అందుకే 72 గంటలు టైం ఇస్తున్న.

ప్రిపేర్ కాకుండా వచ్చి బేసిన్ లు బెండకాయలు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. నల్లమల్ల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నల్లమల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదు.

బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి ప్రిపేర్ కావడానికి 72 గంటలకు టైం ఇస్తున్నాను. ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లి కాని, ఆయన నియోజకవర్గం కొడంగల్లో కాని చర్చ పెడతారంటే నేను రెడీ.

లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంత ఊరు చింతమడక లేదంటే ఆయన నియోజకవర్గం గజ్వేల్ కి వస్తానన్న ఓకే. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్నీ నీ ఇష్టం. మా పార్టీ తరఫున నీ సవాల్ ను నేను స్వీకరిస్తున్నాను. జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వారిని చవట అంటారు. నిజం తెలిసినా ఒప్పుకొని వారిని రేవంత్ రెడ్డి అంటారు.

నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అన్నట్టు రైతులకు ఎవరు ఏమి చేశారో యావత్ తెలంగాణకు తెలుసు. తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో? ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను తలదన్ని భారతదేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణను ఎవరు చేసిండ్రో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో పదేళ్లపాు వ్యవసాయాన్ని పండుగగా చేసి, చివరికి జాతీయ పార్టీగా అవతరించినా కూడా అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపారో అందరికీ తెలుసు. తెలిసినా తెలవనట్టు…కనిపించేదాన్ని కనబడనట్టు నటించేవారిని రేవంత్ రెడ్డి అంటారు.

సమైక్య పాలనలో దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణలో సాగునీరు, వ్యవసాయ రంగంలో కెసిఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి విప్లవం సృష్టించామో ప్రజలందరికీ తెలుసు. సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వక తెలంగాణను ఎండబెట్టారు. కరెంట్ ఇవ్వక కాల్చుకు తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం మొదలైంది. నీళ్లు, నిధులు ,నియామకాలు అనే నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్ర ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు. బనకచర్ల పేరుతో ఆంధ్రకు నీళ్లు పంపుతున్నారు. నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. ఆయన తొత్తులు కొంతమందికి నియామకాలు ఇస్తున్నారు.

స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతుల విషయంలో కెసిఆర్ గారు తీసుకున్నట్టు సాహసోపేత చర్యలు తీసుకోలేదు. ఇది అక్షర సత్యం. 9 ఏళ్ల కాలంలో సుమారు 9 బిలియన్ డాలర్ల డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని మొన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చెబితే అక్కడున్న ప్రొఫెసర్లు,మేధావులు అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్. అన్ని రంగాలకు 24 గంటల కరెంటును, రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంటును ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్ గారు ఒక్కరే.

ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అన్న ముఖ్యమంత్రికి కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడడమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా? మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని నిజంగానే ఆ పాత దుర్ధినాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎరువులు, విత్తనాల కోసం రైతులు యుద్ధమే చేయాల్సి వస్తుంది. ప్రతి మండలంలో రైతులు ఎరువులు, యూరియా కోసం ధర్నాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా..?

ఆధార్ కార్డు చూపిస్తే ఎకరాకు ఒక ఎరువుల బస్తా ఇవ్వాలని అధికారులకు నువ్వు చెప్పిన మాట నిజం కాదా ? ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారు. దశాబ్దాల పాటు సాగునీటి ప్రాజెక్టులను కట్టకుండా రైతుల నోట్లో మట్టి కొట్టి మన పొలాలను ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు ఆత్మహత్యలకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా మార్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి, ఉచిత విద్యుత్ ఇచ్చారు. మిషన్ కాకతీయ తో చెరువులను మంచిగా చేసిండు. చెక్ డాములు కట్టిండు. గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కూడెల్లి, హల్దీ, మాంజీరా వాగులను నింపింది కేసీఆర్ కాదా? రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు తెచ్చుకో.

కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి చివరి గింజ వరకు కొని రైతుల కడుపు నింపింది కేసీఆర్ కాదా? ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అన్న భయంతో ఇవాళ మార్కెట్ యార్డులకు వచ్చిన ధాన్యాన్ని కొనకుండా పారిపోతున్నది నీ ప్రభుత్వం కాదా? ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందా? అది తెచ్చింది కేసీఆర్ కాదా..? అలాంటి రైతు బీమా ప్రీమియం కట్టకుండా మూడు నెలల నుంచి సతాయిస్తూ రైతుల పాలిటీ శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..? ఇందిరమ్మ రాజ్యంలో చెరువులను ఎండబెడితే మిషన్ కాకతీయతో వాటికి పునర్ వైభవాన్ని తీసుకొచ్చి అటు వ్యవసాయానికి ఇటు మత్స్య పరిశ్రమకు చేయూతనిచ్చింది కేసీఆర్ కాదా?

ఇవాళ ఇన్ లాండ్ ఫిషరీస్ లో భారత దేశంలో నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణను తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా..? 30 వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ కాదా.. ఆంధ్రాకు కృష్ణా గోదావరి నీళ్లను తరలించడానికి హారతులు పట్టింది మీ పార్టీ నేతలే. దాశరధి గారు చెప్పినట్టు ఒక్కొక్క నీటి బొట్టు ను ఒడిసిపట్టి ఇవాళ తెలంగాణను కోటి ఎకరాల మాగానంగా మార్చింది కేసీఆర్ గారు కాదా? ఆ విషయం ప్రజలకు తెలియదా.. 2014లో తెలంగాణలో ధాన్యము ఉత్పత్తి ఎంత? 2023 నాటికి తెలంగాణలో ధాన్యము ఉత్పత్తి ఎంత? ఈ విషయం నీకు తెలియదా... గురువు చంద్రబాబు ప్రాపకం కోసం గోదావరి నీళ్లను ఏపీకి తరలించడానికి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోకుండా ఉన్న రేవంత్ కుటిల నీతిని తెలంగాణ ప్రజలు, రైతాంగం గుర్తించింది.

బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకుండా మహబూబ్ నగర్ ను ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా.. ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అన్నదాతల ఆత్మహత్యలను ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా..? ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒప్పుకున్న విషయం వాస్తవం కాదా.. మీ ఇందిరమ్మ రాజ్యంలో రైతులు బోర్లేసి బొక్క బోర్లా పడ్డారు అనడానికి బోర్ల రాంరెడ్డి నిదర్శనం కాదా.. రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అనిపిస్తుంది.

ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని అన్యాయంగా జైల్లో పెట్టిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడితే నికృష్టంగా ఉంది. 2014లో అధికార మార్పిడి మాత్రమే జరగలేదు. ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా రెండు దఫాలు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా.. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా, మోడీ గారు ఇబ్బందులు పెట్టినా తట్టుకొని 30 వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా.. రాహుల్ గాంధీతో వరంగల్ లో చేపించిన రైతు డిక్లరేషన్ లోని ఒక్క హామీనైనా అమలు చేశారా.. 50 వేల కోట్ల రుణమాఫీని 12,000 కోట్లకు కుదించి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకొని బయటపడ్డారు. రైతు డిక్లరేషన్ లోని ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సిగ్గు లేకుండా రైతుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.

మేము 2063 రైతు వేదికలను కట్టాం.. 5వేల ఎకరాలకు ఒకరి చొప్పున అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను నియమించాం. అకుంఠిత దీక్ష, పట్టుదలతో ఓ తపస్సు లాగా కెసిఆర్ గారి నాయకత్వంలో మేం పనిచేస్తేనే తెలంగాణలో వ్యవసాయ విస్తరణ జరిగింది. సాగునీరు, విద్యుత్తు, గ్రామీణ అభివృద్ధి ఇలా అన్ని రంగాలను సమన్వయం చేసుకుంటూ పోతేనే ఇవాళ భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ అయింది. అసెంబ్లీలో పెడతావో, అంబేద్కర్ విగ్రహం దగ్గర పెడతావో చర్చ నీ ఇష్టం. కొండారెడ్డిపల్లె, చింతమడక, కొండగల్ లో ఎక్కడ చర్చ పెడతావో నువ్వే డిసైడ్ చేసుకో. 8 తారీకు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చినా సరే. మీడియా ముందే చర్చిద్దాం. నీళ్లకు నీళ్లు పాలకు పాలు చేసేద్దాం. బురద చల్లి తప్పించుకుపోవడం రేవంత్ రెడ్డి కి అలవాటు.

11 సార్లు రైతుల ఖాతాల్లో సుమారు 73 వేల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ వేసింది కానీ ఎప్పుడు ఇలా హడావుడి చేయలేదు. నాలుగు పంటలకు గాను ఒక్క పంటకు ఒక్కసారి రైతుబంధువేసి దానికి పండుగ చేసుకోమని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు. రైతులకు ఎగ్గొట్టింది ఎంత? ఇచ్చింది ఎంతో చెప్పాలి. కెసిఆర్ ఎకరాకు 10000 ఇస్తే నేను 15000 ఇస్తానన్నావు. కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుంటే నేను మూడు పంటలకు ఇస్తానన్నావు. మరి ఎక్కడైనా ఎకరాకు 15 రైతుభరోసా ఇచ్చావా..? రైతు భరోసాలో 39 వేల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఒక ఎకరాకి 19000 రూపాయలు ప్రతి రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉంది. అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ లోను 38 వేల కోట్ల రూపాయలను ఎగొట్టారు.. నాట్లు వేసేటప్పుడు కెసిఆర్ రైతు బంధు ఇస్తే, ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నాడు.

కెసిఆర్ హయాంలో పూర్తయిన నియామకాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే చేసినా అని రేవంత్ రెడ్డి గప్పాల్ కొట్టుకుంటున్నాడు. ఇదే విషయం అశోక్ నగర్కు వచ్చి చెప్పే దమ్ముందా..? మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుంది. కోటీశ్వరులను చేస్తానన్న మాటల్ని తెలంగాణ ఆడబిడ్డలు నమ్మడం లేదు. తమకి ఇస్తామన్న నెలకు 2500 ఎప్పుడు ఇస్తావో చెప్పాలని నిలదీస్తున్నారు. నెలకు 2500 ఎప్పుడు ఇస్తారని కోటి 68 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఇస్తానన్న స్కూటీ ఏమైందని మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని మా తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో నింపుతానన్నా మాట ఎప్పుడు నిలబెట్టుకుంటావని నిరుద్యోగులు అడుగుతున్నారు. సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు? ఎకరాకు 15000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తావో రైతుల ఎదురుచూస్తున్నారు. 4000 పెన్షన్ ఏమైందని పెద్ద మనుషులు ఎదురుచూస్తున్నారు. 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తానని రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా ఈసారి ఓటేయదు. దళిత బంధు ఇస్తున్నందుకు దళితులు ఓట్లు వేస్తారా..? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు 12 లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు ఓట్లేయాలా? 4000 పెన్షన్ ఇస్తున్నందుకు ముసలి వాళ్లు ఓట్లేయాలా? రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగులు ఓట్లేయాలా? నెలకు 2500 ఇస్తున్నందుకు ఆడబిడ్డలు ఓటు వేయాలా? రైతుబంధు ఎగ్గొట్టినందుకు రైతుల ఓట్లు వేయాలా?

చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు నీకు ఓటు వేయాలా? ఇవాళ తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ మాత్రమే సంతోషంగా ఉంది. దండుపాళ్యం ముఠాలాగా ఏర్పడి ఆ తొట్టి గ్యాంగ్ అందినకాడికి దోచుకుంటుంది. బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ దోచుకుంటున్నారు. ఒక్క కొత్త స్కీము అమలు చేయలేదు.. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు.. కానీ ఇప్పుడు అప్పు రెండు లక్షల కోట్లకు చేరింది. ఎక్కడికి పోతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ , ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్ ఖాతాల్లో టకీ టకీమని డబ్బులు పడుతున్నాయి. పేసిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కు తెలంగాణను ఏటీఎం లాగా మార్చాడు.

రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు. కోవర్టు పాలన. చంద్రబాబు నాయుడు కోవర్డు రేవంత్ రెడ్డి పాలన. ఇక్కడి నీళ్లను ఆంధ్రకు తరలించే కోవర్డు పాలన. ఇక్కడి నిధులను ఢిల్లీకి పంపే కోవర్డు పాలన తెలంగాణలో సాగుతుంది. మొన్నటిదాకా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆంధ్ర కోసం పనిచేసిన ఆదిత్య దాస్ ను తీసుకొచ్చి సాగునీటి సలహాదారుడుగా ఎవరైనా నియమిస్తారా. రేవంత్ రెడ్డి కోవర్ట్. అనుమానం అవసరం లేదు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిదని మేము ఎప్పుడో చెప్పాం.

Politent News Web3

Politent News Web3

Next Story