దేవపూజలకు శ్రావణమాసానికి మించిన సమయం లేదు

పవిత్రమైన దేవపూజలకు శ్రావణమాసానికి మించిన సమయం లేదు.. శ్రావణ సోమవారాలు..శ్రావణ మంగళవారాలు.. శ్రావణ శుక్రవారం వంటివి ఈ నెలకు ప్రత్యేకశోభను ఇస్తాయి... శ్రావణ పూర్ణమకు ముందు వచ్చే శుక్రవారాన్నే వరలక్ష్మీ వ్రతంగా చేసుకుంటారు.
మేలిమి గుణాలు..శోభ..కళ..సంపద...ఉత్సాహం..ఆనందం..శాంతం. సామరస్యం..సౌమనస్యం ఈ శుభగుణాల సాకారమే శ్రీలక్ష్మీ... ప్రతి ఒక్కరు ఈ శుభ గుణాలనే ఆశిస్తారు...అందుకే లక్ష్మీని ఆరాధిస్తారు..వివాహిత మహిళలు లక్ష్మీ కటాక్షం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.. మహిళలకు అష్ట ఐశ్వర్యాలను పొందడానికి ఓ వ్రతాన్ని చెప్పమని పరమేశ్వరుడిని పార్వతీ దేవి కోరినప్పుడు ఆ జగద్రక్షకుడు ఈ వ్రతం గురించి చెప్పాడట! ఈ వ్రత మహత్యాన్ని చెప్పే ఓ పురాణగాధ కూడా ప్రచారంలో వుంది.. భర్త, అత్తమామలపై అనురాగాన్ని కురిపిస్తూ కుటుంబం పట్ల ప్రేమ వున్న చారుమతి అనే ఓ భక్తురాలిని చూసి లక్ష్మీదేవి ముగ్ధురాలైందట.. ఆమెకు కలలో కనిపించి శ్రావణ శుక్ల శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని చెప్పిందట! చారుమతి ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించిందట! ఆ వెంటనే ఆమె ఇల్లు సరిసంపదలతో నిండిపోయిందట..
మరో కథ కూడా ప్రచారంలో వుంది... చిత్రనేమి అనే వ్యక్తి ఓ సందర్భంలో శివుడి పట్ల పక్షపాతాన్ని చూపిస్తాడు.. అది తెలుసుకున్న పార్వతీ దేవి ఆగ్రహిస్తుంది.. అతడిని కుష్ణువాడివి కమ్మని శపిస్తుంది... శాపవశాత్తూ కుష్ణువాడైన చిత్రనేమి ఓసారి కొందరు మహిళలు ఆచరిస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో శ్రద్ధతో గమనించి.. ఆలకించాడట.. అంతే...వ్రతం పూర్తయ్యేసరికి చిత్రనేమికి శాప విమోచనమైందట!
లక్ష్మి దేవి ఎనిమిది శక్తులకు సంకేతం...శ్రీ అంటే సంపద..భూ అంటే భూమి...సరస్వతి అంటే జ్ఞానం.. ప్రీతి...కీర్తి..శాంతి..తుష్టి...పుష్టి ...ఈ ఎనిమిది శక్తులను కలిపి అష్టలక్షులంటారు.. వరలక్ష్మి పూజ ఈ అష్ట లక్షుల పూజతో సమానం..తన భక్తులకు వరాలు ఇవ్వడానికి ఆ లక్ష్మీదేవి సదా సిద్ధంగా వుంటుంది...అందుకే ఆమెను వరలక్ష్మి అంటారు..
వ్రతాన్ని ఆచరించే మహిళలు ఉదయమే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి... పూజా మండపాన్ని రంగవల్లులతో...రంగు రంగుల పూలతో అలంకరిస్తారు.. మండపంలో ముగ్గువేసి దానిపై అక్షితలు పోసి దానిపైన కలశం వుంచి కొబ్బరికాయతో తయారు చేసిన లక్ష్మీ ముఖాన్ని వుంచుతారు.. కలశానికి గంధం రాసి కుంకుమ పెడతారు.. ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి.. తర్వాత కలశపూజ చేస్తారు.. అనంతరం పసుపు రాసి తొమ్మది దారాలతో ముడులు వేసిన తోరాన్ని కలశం దగ్గర వుంచి పూజిస్తారు. చివరగా ఆ తోరాన్ని పూజ చేసిన వారు తమ చేతికి ధరిస్తారు.. అనంతరం లక్ష్మీ అష్టోత్తర..సహస్రనామాలతో పూజను ముగించి మరో ముత్తయిదువకు వాయినం ఇవ్వడంతో పూజా విధానం ముగుస్తుంది..
లక్ష్మీస్తోత్రం
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
