గడచిన 17 నెలలుగా పాలన చేతకాక... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించే నాటకాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజాల్లా ఎగిరిపోతాయని ఆయన అన్నారు. నల్గొండ పర్యటనలో ఉన్న కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కమీషన్లు తప్ప ఈ ప్రభుత్వంలో పాలన కనపించడం లేదని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు డైరెక్టుగా సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్ధితిని స్పష్టం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమీషన్లు లేనిదే పనులు జరగడం లేదని సాక్ష్యం చెపుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది, 8 మంది ప్రాణాలు కోల్పోతే సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పిటికీ ప్రపంచానికి చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని కేటీఆర్ మండి పడ్డారు. నల్గొండలో సుంకుశాల ప్రాజెక్టు కూలితే ప్రభుత్వం ఇప్పకీ స్పందించలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు కలసి నాటకాలు ఆడుతున్నాయని, ప్రజల సమస్యలపైకాకుండా అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని బలిపెడుతున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేని చేతకాని ప్రభుత్వమని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రజలు తిరగబడి రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని కేటీఆర్ అన్నారు.

Updated On
Politent News Web 1

Politent News Web 1

Next Story