2026 T20 World Cup: టీ20 ప్రపంచ కప్ నుంచి ఆడమ్ మిల్నే దూరం
ఆడమ్ మిల్నే దూరం

2026 T20 World Cup: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో 31 ఏళ్ల అనుభవజ్ఞుడైన పేసర్ కైల్ జేమీసన్ తుది జట్టులోకి ఎంపికయ్యారు.
న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఆడమ్ మిల్నే ఎడమ కాలి తొడ కండరాల గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో జరిగిన SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఆడుతున్న సమయంలో ఆయనకు ఈ గాయమైంది. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రపంచ కప్ వరకు కోలుకోవడం సాధ్యం కాదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ఆడమ్ మిల్నే స్థానంలో కివీస్ సెలెక్టర్లు కైల్ జేమీసన్‌ను ఎంపిక చేశారు. నిజానికి జేమీసన్ తొలుత ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యారు. అయితే మిల్నే దూరం కావడంతో ఆయనకు ప్రధాన జట్టులో అవకాశం దక్కింది. 31 ఏళ్ల జేమీసన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ ఆయన ప్రదర్శన నిలకడగా ఉండటంతో పాటు భారత పిచ్‌లపై అవగాహన ఉండటం జట్టుకు అదనపు బలంగా మారనుంది.
న్యూజిలాండ్ హెడ్ కోచ్ రోబ్ వాల్టర్ ఈ పరిణామంపై స్పందిస్తూ, మిల్నే వంటి కీలక ఆటగాడు దూరం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. "ఆడమ్ మిల్నే ఈ టోర్నీ కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ ఈ సమయంలో గాయపడటం బాధాకరం. అయితే, జేమీసన్ ఇప్పటికే జట్టుతో ఉండటం, భారత్‌లో జరుగుతున్న సిరీస్‌లో మంచి లయలో ఉండటం మాకు సానుకూలాంశం" అని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది.

