టీ20 వరల్డ్ కప్ నుంచి పాట్ కమిన్స్ అవుట్

2026 T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. గత ఆరు నెలలుగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తగ్గకపోవడంతో, వైద్యుల సలహా మేరకు సెలక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

కమిన్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిడ్నీ సిక్సర్స్ పేసర్ బెన్ ద్వార్షుయిస్ ను జట్టులోకి తీసుకున్నారు. ఎడమచేతి వాటం బౌలర్ అయిన ద్వార్షుయిస్, వేగంతో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు. శ్రీలంక, భారత్ వేదికలుగా జరగనున్న ఈ టోర్నీలో ద్వార్షుయిస్ వైవిధ్యమైన బౌలింగ్ జట్టుకు ప్లస్ అవుతుందని సెలక్టర్లు భావిస్తున్నారు.

కేవలం కమిన్స్ మాత్రమే కాదు, ఓపెనర్ మ్యాథ్యూ షార్ట్ ను కూడా తుది జట్టు నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. అతడి స్థానంలో యంగ్ బ్యాటర్ మాథ్యూ రెన్షా (Matthew Renshaw)కు చోటు దక్కింది. రెన్షా ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అతడికి వరల్డ్ కప్ టికెట్ లభించింది. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పేరును పరిశీలించినప్పటికీ, సెలక్టర్లు మాత్రం రెన్షా వైపే మొగ్గు చూపారు.

టీ20 ప్రపంచకప్ 2026 - ఆస్ట్రేలియా తుది జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జేవియర్ బార్ట్‌లెట్, జోష్ హాజిల్‌వుడ్, కూపర్ కానలీ, జోష్ ఇంగ్లిస్ (కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ కుహ్నెమాన్, బెన్ ద్వార్షుయిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మాథ్యూ రెన్షా, నాథన్ ఎల్లిస్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆడనుంది. కమిన్స్ లేకపోవడం ఆసీస్ పేస్ దళాన్ని కాస్త బలహీనపరిచినా, మిగిలిన ఆటగాళ్లతో టైటిల్ వేటకు కంగారూలు సిద్ధమవుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story