Naman Dhir: క్రికెట్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఫినిషర్ పాత్ర పోషించడం ఏ ఆటగాడికైనా కత్తిమీద సాము లాంటిదే. క్రీజులోకి అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే భారీ షాట్లు బాదాల్సిన తీవ్ర ఒత్తిడి ఉంటుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో యువ సంచలనం నమన్ ధీర్ సరిగ్గా ఇలాంటి ఒత్తిడిలోనే మైదానంలోకి దిగాడు. అయితే ఏమాత్రం తడబడకుండా, కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 15 బంతుల్లోనే అజేయంగా 42 పరుగులు సాధించాడు. టీమ్ ఇండియాను చిరస్మరణీయ విజయతీరాలకు చేర్చడమే కాకుండా, 17 ఏళ్ల నాటి చారిత్రక రికార్డును తిరగరాశాడు.

ఇర్ఫాన్ పఠాన్ రికార్డు గల్లంతు

నమన్ ధీర్ సాధించిన ఈ అజేయ 42 పరుగుల ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత జట్టు తరఫున 7వ స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా నమన్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉండేది. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ 7వ స్థానంలో దిగి అజేయంగా 33 పరుగులు చేశాడు. ఆ రికార్డును నమన్ ధీర్ 17 ఏళ్ల తర్వాత బద్దలు కొట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

డెత్ ఓవర్లలో భీకర హిట్టర్.. 204+ స్ట్రైక్ రేట్

నమన్ ధీర్ బ్యాటింగ్ టెక్నిక్, మ్యాచ్‌ను ముగించే నేర్పును చూసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ అతనిపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచారు. అతను భారీ సిక్సర్లు బాదడమే కాకుండా, స్ట్రైక్ రొటేట్ చేయడంలోనూ దిట్ట. ముఖ్యంగా టీ20ల్లో 16 నుంచి 20వ ఓవర్ల మధ్య నమన్ అత్యంత ప్రమాదకరంగా మారతాడు. గణాంకాలను పరిశీలిస్తే.. 16-20 ఓవర్ల వ్యవధిలో నమన్ ధీర్ 167 బంతులు ఎదుర్కొని ఏకంగా 341 పరుగులు సాధించాడు. ఇందులో 19 సిక్సర్లు, 34 ఫోర్లు ఉన్నాయి. ఈ డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ 204కు పైగా ఉండటం అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యానికి నిదర్శనం.

క్రైస్ట్‌చర్చ్‌లో కివీస్ బౌలర్లకు చుక్కలు!

ఈ మ్యాచ్‌లో నమన్ ధీర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. తాను ఎదుర్కొన్న నాలుగో బంతికే అద్భుతమైన సిక్సర్ బాదాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వేసిన ఓవర్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. అనంతరం 18వ ఓవర్‌లో నాథన్ స్మిత్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. 19వ ఓవర్‌లో మరో ఫోర్ రాబట్టిన ధీర్, ఆఖరి ఓవర్ తొలి బంతికే ఫోర్ బాది లక్ష్యాన్ని సులభతరం చేశాడు. చివరగా మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో బంతిని భారీ సిక్సర్‌గా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా భవిష్యత్తు ఫినిషర్‌గా తన స్థానాన్ని నమన్ ధీర్ పదిలం చేసుకున్నాడు.

Next Story