Rishabh Pant: అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌కు టీమిండియా సర్వం సిద్ధమైంది! అయితే ఈ మ్యాచ్‌ అందరి కంటే ఒక ప్లేయర్‌కు చాలా చాలా ప్రత్యేకం. ఆయనే టీమిండియా డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్! పంత్ కెరీర్‌లో ఇది 50వ టెస్ట్ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఈ మైలురాయి మ్యాచ్‌లో పంత్ ఎలా రాణిస్తాడనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఈ నేపథ్యంలో హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు రోజుల ట్రెయినింగ్ క్యాంప్‌లో దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. సౌతాఫ్రికాతో జరిగిన గత టెస్ట్ మ్యాచ్‌లో పంత్ బాధ్యతారాహిత్యంగా షాట్లు ఆడి అవుట్ కావడంపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నువ్వు సీనియర్ ప్లేయర్‌వి.. బాధ్యతాయుతంగా ఆడాలంటూ పంత్‌కు గంభీర్ క్లాస్ పీకాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ పంత్ స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు, గంభీర్ అతని వెనకాలే నిలబడి ప్రతి మూమెంట్‌ను నిశితంగా పరిశీలించాడు.

కోచ్ గౌతీ సూచనల మేరకు పంత్ తన దూకుడును తగ్గించి ఆచితూచి ఆడుతున్నాడు. ప్రాక్టీస్‌లో ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చాడు. అయితే మేనేజ్‌మెంట్ పంత్‌ సహజసిద్ధమైన దూకుడును పూర్తిగా తగ్గించుకోమని చెప్పలేదు. కానీ మ్యాచ్‌ పరిస్థితులకు, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటను మార్చుకోవాలని మాత్రమే సూచించింది. క్రీజులో పాతుకుపోయి, ఇన్నింగ్స్‌ను నిర్మించడంపైనే ఇప్పుడు పంత్ ఫోకస్ పెట్టాడు.

ప్రస్తుత జట్టులో కేఎల్ రాహుల్ తర్వాత పంత్ అత్యంత సీనియర్ ప్లేయర్. వైస్ కెప్టెన్సీ పోయినప్పటికీ జట్టులో అతని ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని మేనేజ్‌మెంట్ వర్గాలు అంటున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహాన్ని నింపే పంత్.. ఈ 50వ టెస్ట్‌లో సరికొత్త బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో మెరుస్తాడేమో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story