Farokh Engineer: భారత ప్రభుత్వం దేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'ని ప్రకటించి ఏకంగా 53 ఏళ్లు గడుస్తున్నా, నాటి భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఫరూక్ ఇంజనీర్ ఇప్పటికీ ఆ అవార్డు కోసం ఎదురుచూస్తున్నారు. 1961 నుండి 1975 వరకు భారతదేశం తరఫున 46 టెస్టులు, 5 వన్డేలు ఆడిన ఫరూక్ ఇంజనీర్, ముప్పై ఏళ్ల వయసులో ఉండగా (1973లో) ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతుండగా, అప్పటి భారత జట్టు మేనేజర్ హేము అధికారి వార్తాపత్రికలను చూసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆ పురస్కారానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం గానీ, ఆహ్వానం గానీ తనకు అందలేదని ఫరూక్ ఇంజనీర్ పేర్కొన్నారు.

అప్పట్లో వార్తాపత్రికలే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేవని, మేనేజర్ హేము అధికారి సైతం ప్రభుత్వం నుంచి త్వరలోనే లేఖ వస్తుందని తెలిపారని, కానీ నేటికీ తనకు ఎలాంటి లేఖ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎవరైనా ప్రభుత్వం నుంచి పిలుస్తారేమోనని నిరీక్షించానని, గతంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లానని చెప్పారు. ఇటీవల ఐసీసీ ఛైర్మన్ జే షాను కలిసి మాట్లాడగా, ఆయన సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫరూక్ ఇంజనీర్ వెల్లడించారు.

ప్రస్తుతం 88 ఏళ్ల వయసున్న ఫరూక్ ఇంజనీర్ ఇంగ్లాండ్‌లో స్థిరపడినప్పటికీ, హృదయపూర్వకంగా తానొక భారతీయుడినని, ఈ పద్మశ్రీ అవార్డు తనకు ఎంతో ప్రాధాన్యమైనదని తెలిపారు. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం అందుకొని, తన భార్య సమక్షంలో ఆ పురస్కారాన్ని స్వీకరించి ఇంట్లో భద్రపరుచుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన కోరుకున్నారు. ఫరూక్ ఇంజనీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి (BCCI) కూడా స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకు బిసిసిఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కాగా, కళలు, విద్య, పరిశ్రమలు, సామాజిక సేవ, వైద్యం, మరియు క్రీడలు వంటి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం ప్రతిఏటా పద్మశ్రీ పురస్కారాలను అందజేస్తుంది. ఈ అవార్డు గ్రహీతలకు భారత రాష్ట్రపతి సంతకం చేసిన పత్రం (సనద్) తో పాటు ఒక పతకం అందజేస్తారు. అయితే ఈ పురస్కారంలో ఎలాంటి నగదు బహుమతి గానీ, ఇతర రాయితీలు గానీ ఉండవు.

PolitEnt Media

PolitEnt Media

Next Story