Abhishek Sharma: ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్ పోరులో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. దాయాది పాకిస్తాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లను లెక్కచేయకుండా మైదానం నలువైపులా బౌండరీల వర్షం కురిపించిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. కేవలం 28 బంతుల్లోనే 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 61 పరుగులు చేసి ప్రత్యర్థికి పీడకల మిగిల్చాడు.

20 బంతుల్లోనే ఫిఫ్టీ.. సరికొత్త రికార్డు..

పాకిస్తాన్‌పై అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. గతంలో పాక్‌పై 24 బంతుల్లో తానే నమోదు చేసిన రికార్డును తానే తిరగరాస్తూ.. ఈసారి కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత స్కోరు 81/2 కాగా.. అందులో అభిషేక్ వాటానే 52 పరుగులు కావడం అతని దూకుడుకు నిదర్శనం.

భారీ మూల్యం చెల్లించుకున్న పాకిస్తాన్..

ఈ మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్ భారత్‌కు కొండంత బలాన్నిచ్చింది. అభిషేక్ శర్మకు పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు లైఫ్ ఇచ్చారు. సైమ్ అయూబ్ డీప్ మిడ్‌వికెట్‌లో సులువైన క్యాచ్‌ను నేలపాలు చేయగా.. ఆ తర్వాత అబ్రార్ అహ్మద్ మరో క్యాచ్ వదిలేశాడు. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఇచ్చిన అవకాశాన్ని జారవిడవగా, పేసర్ అహ్మద్ డానియల్ రనౌట్ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు.

ఈ నాలుగు లైఫ్‌లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న అభిషేక్.. పాక్ బౌలర్లను ఊచకోత కోసి భారత్‌కు పవర్‌ప్లేలోనే భారీ ఆధిక్యాన్ని అందించాడు.

Next Story