14 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో సరికొత్త చరిత్ర!

Abhishek Sharma’s Carnage: గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 14 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేసి, అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో జాకబ్ డఫ్ఫీ వేసిన చివరి బంతిని సిక్సర్‌గా మలిచి అభిషేక్ ఈ ఘనతను అందుకున్నాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 50) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డుకు అభిషేక్ అత్యంత చేరువగా వచ్చాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరు చూస్తుంటే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే సిక్సర్‌తో ఖాతా తెరిచిన అతను, మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 340గా నమోదవ్వడం విశేషం. అభిషేక్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 57) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో, భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.

భారత్ తరపున టీ20ల్లో వేగవంతమైన ఫిఫ్టీల జాబితాను పరిశీలిస్తే.. యువరాజ్ సింగ్ (12 బంతులు) మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు అభిషేక్ శర్మ (14 బంతులు) రెండో స్థానానికి చేరుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో సౌత్ ఆఫ్రికాపై 16 బంతుల్లో ఫిఫ్టీ చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. అయితే ప్రపంచ రికార్డు మాత్రం నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ (9 బంతులు) పేరిట ఉంది. ఈ అద్భుత విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story