‘God of Cricket’ Story Set for OTT Release: క్రికెట్ , సినీ ప్రియులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది! ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అపరాజిత రికార్డులతో 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా నిలిచిన సచిన్ టెండూల్కర్ లైఫ్ స్టోరీ త్వరలోనే మీ ముందుకు రాబోతోంది. ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ (Sachin: A Billion Dreams) పేరుతో ఈ కథ రానున్నట్లు ఆహా సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను పంచుకుంది.

"ఒక కల.. చేతిలో బ్యాట్.. యావత్ ప్రపంచాన్ని ఉత్తేజపరిచిన అద్భుత ప్రయాణం! క్రికెట్‌కు దేవుడిగా మారిన ఒకే ఒక్కడి కథ.. త్వరలోనే ఆహా వేదికగా మీ ముందుకు రాబోతోంది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఆహా టీమ్.

అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2017లోనే సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో ఒక సూపర్ హిట్ బయోపిక్ డాక్యుమెంటరీ థియేటర్లలో విడుదలైంది. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో వచ్చిన ఆ డాక్యుమెంటరీలో.. సచిన్ చిన్నతనం నుండి ఆయన రిటైర్మెంట్ వరకు జరిగిన ఎన్నో అరుదైన విషయాలను, రియల్ ఫుటేజీతో సహా కళ్లకి కట్టినట్టు చూపించారు.

మరి ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయేది అదే డాక్యుమెంటరీయా? లేక సచిన్ జీవితంపై సరికొత్తగా ప్లాన్ చేసిన ఏదైనా వెబ్ సిరీస్ లాంటిదా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా, గాడ్ ఆఫ్ క్రికెట్ ప్రయాణాన్ని మళ్లీ స్క్రీన్ మీద చూడటం అంటే సచిన్ అభిమానులకు పండగే అని చెప్పాలి!

Next Story