కేఎల్ రాహుల్ సెంచరీతో భారత్ ఆధిక్యం..

Ahmedabad Test: వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో జట్టును పటిష్ఠ స్థితికి చేర్చాడు. భారత ఇన్నింగ్స్‌లో రాహుల్ తనదైన శైలిలో రాణించాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ కొట్టాడు. రాహుల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ శతకం కాగా సొంతగడ్డపై మాత్రం ఇది కేవలం రెండో సెంచరీ మాత్రమే. స్వదేశంలో అతను చివరగా 2016లో చెన్నైలో ఇంగ్లండ్‌పై శతకం సాధించాడు.

66 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ *214/3* గా ఉంది. రాహుల్‌కు జతగా ధృవ్ జురెల్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

రాణించిన గిల్, విఫలమైన మిడిలార్డర్

రెండో రోజు ఆటలో రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్‌మన్‌ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రీవ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, జేడన్ సీల్స్ ఓ వికెట్ తీశారు.

విండీస్‌ పేకమేడ: సిరాజ్, బుమ్రా విజృంభణ

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 162 పరుగులకే ఆలౌటైంది. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ (4/40), జస్ప్రీత్ బుమ్రా (3/42) ల విజృంభణకు విండీస్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు.

విండీస్ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్ బ్యాట్స్‌మెన్ జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. రెండంకెల స్కోర్లు చేసిన వారిలో అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) ఉన్నారు. భారత వికెట్ కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్‌లు పట్టి రాణించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story