నేషనల్ బాక్సింగ్ టోర్నీ వాయిదా

National Boxing Tournament Postponed: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యం క్రీడా ఈవెంట్‌లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నెల చివర్లో (డిసెంబర్ 31 నుంచి జనవరి 6 వరకు) ఢిల్లీ వేదికగా జరగాల్సిన 9వ ఎలైట్ మెన్స్, ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ ను నిర్వహకులు వాయిదా వేశారు. క్రీడాకారుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) ప్రకటించింది.

ఢిల్లీలో కొన్ని రోజులుగా గాలి నాణ్యత సూచీ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో బాక్సింగ్ వంటి శారీరక శ్రమతో కూడిన టోర్నమెంట్ నిర్వహించడం వల్ల క్రీడాకారుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని, భారత బాక్సింగ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి, టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.

వాయిదా పడిన ఈ టోర్నమెంట్‌ను తిరిగి ఎప్పుడు, ఏ వేదికపై నిర్వహిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ నిర్వహణకు అనువైన వాతావరణ పరిస్థితులు మెరుగుపడగానే, కొత్త తేదీలను ప్రకటించడానికి BFI కసరత్తు చేస్తోంది. అప్పటివరకు, దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బాక్సర్లు తమ శిక్షణను కొనసాగించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story