Ajinkya Rahane Makes Crucial Decision: అజింక్యా రహానే కీలక నిర్ణయం.. రెండు కీలక మ్యాచ్‌లకు దూరం
రెండు కీలక మ్యాచ్‌లకు దూరం

Ajinkya Rahane Makes Crucial Decision: ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్యా రహానే రంజీ ట్రోఫీ ప్రస్తుత సీజన్‌లో మిగిలిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను అందుబాటులో ఉండటం లేదని రహానే ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి సమాచారం అందించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టు జనవరి 22 నుండి 25 వరకు హైదరాబాద్‌తో ఎవే మ్యాచ్ (అవే గ్రౌండ్‌లో) ఆడనుంది. ఆ తర్వాత జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలో ఢిల్లీతో తలపడనుంది. ఈ రెండు కీలక మ్యాచ్‌లకు రహానే అందుబాటులో ఉండరని ఎంసీఏ వర్గాలు ధృవీకరించాయి. హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం జట్టును జనవరి 17న ఎంపిక చేయనున్నారు. విజయ్ హజారే ట్రోఫీ విరామానికి ముందు, ముంబై జట్టు గ్రూప్-డిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు డ్రాలతో మొత్తం 24 పాయింట్లతో ముంబై పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఒకవేళ ముంబై నాకౌట్ దశకు అర్హత సాధిస్తే, రహానే తిరిగి జట్టులో చేరతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. గత ఏడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో, "కొత్త నాయకుడిని తయారు చేయడానికి ఇదే సరైన సమయం.. ఒక ఆటగాడిగా ముంబైకి మరిన్ని ట్రోఫీలు అందించడానికి నా వంతు కృషి చేస్తాను" అని రహానే సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి పోరాడుతున్న రహానే, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. కాగా, ఐపీఎల్‌లో అతను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుతో ఒప్పందం కలిగి ఉన్నాడు. రాబోయే 2026 ఐపీఎల్ సీజన్‌కు కేకేఆర్ జట్టు కెప్టెన్‌గా రహానే బాధ్యతలు చేపట్టనున్నారు.

