టీ20ల్లో అగ్రస్థానం

Tops T20 Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ సంచలనం సృష్టించింది. తన కెరీర్‌లో తొలిసారిగా టీ20 బౌలింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 23 (మంగళవారం) వెలువడిన ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఒక స్థానం ఎగబాకి 737 రేటింగ్ పాయింట్లతో అగ్రపీఠాన్ని అధిరోహించింది. విశాఖపట్నంలో శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో ఆమె 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసింది. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్‌ను వెనక్కి నెట్టి దీప్తి మొదటి స్థానానికి చేరుకుంది. సదర్‌ల్యాండ్ ప్రస్తుతం 736 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

టీ20 బ్యాటింగ్ విభాగంలో జెమిమా రోడ్రిగ్స్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 9వ స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై అజేయ అర్ధసెంచరీతో చెలరేగిన ఆమె, టాప్-10లోకి ప్రవేశించింది. ప్రస్తుతం టీ20 బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3వ స్థానం), షెఫాలీ వర్మ (10వ స్థానం) కూడా టాప్-10లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో అరుంధతి రెడ్డి ఐదు స్థానాలు ఎగబాకి 36వ ర్యాంకుకు చేరుకుంది.

మరోవైపు, వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుస సెంచరీలతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. లారా వోల్వార్డ్ 820 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, స్మృతి మంధాన రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా క్రీడాకారిణి సునే లూస్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 34వ స్థానానికి, ఆల్ రౌండర్ల జాబితాలో 22వ స్థానానికి చేరుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story