సంజూ శాంసన్

Sanju Samson: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌పై జరిగిన సెమీఫైనల్ విజయంలో భారత్ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్‌లో 89 పరుగులతో వీరవిహారం చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న సంజూ శాంసన్, తన విజయం కంటే జస్ప్రీత్ బుమ్రా వేసిన బౌలింగ్‌నే ఎక్కువగా కొనియాడారు. "నిజానికి ఈ అవార్డు బుమ్రాకే దక్కాలి.. ఆయన డెత్ ఓవర్లలో అంత గొప్పగా బౌలింగ్ చేయకపోయి ఉంటే, నేను ఇక్కడ ఇలా నిలబడి ఉండేవాడిని కాదు" అని శాంసన్ ఎంతో వినమ్రంగా చెప్పారు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వికెట్ తీశారు. ఈ వికెట్‌తో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం. దీనిపై శాంసన్ స్పందిస్తూ.. "బుమ్రా ఒక ప్రపంచ స్థాయి బౌలర్. ఇలాంటి బౌలర్లు తరానికి ఒక్కరే పుడతారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా బౌలర్లు తమను తాము నమ్మి బౌలింగ్ చేసిన విధానమే మనల్ని ఫైనల్‌కు చేర్చింది" అని బౌలర్లందరినీ అభినందించారు.

తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. గత మ్యాచ్‌ నుంచి మంచి ఫామ్‌లో ఉన్నానని, దేశం కోసం ఆడే కీలకమైన మ్యాచుల్లో ఆ ఫామ్‌ను కొనసాగించడం చాలా ముఖ్యమని శాంసన్ అన్నారు. వాంఖడే స్టేడియంలో ఏ స్కోరైనా ఛేజింగ్ చేసే అవకాశం ఉంటుందని తనకు తెలుసని, అందుకే వీలైనన్ని ఎక్కువ పరుగులు జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడిన శాంసన్, ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా గట్టి పోటీ ఇచ్చారని, ఇది ఒక గొప్ప సెమీఫైనల్ అని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story