Amit Mishra: ఐపీఎల్ క్రికెటర్ అమిత్ మిశ్రాపై భార్య ఫిర్యాదు: వరకట్న వేధింపుల ఆరోపణలు
వరకట్న వేధింపుల ఆరోపణలు

Amit Mishra: ఐపీఎల్ క్రికెటర్ అమిత్ మిశ్రా మరియు అతని కుటుంబ సభ్యులపై అతని భార్య, మోడల్ గరిమా తివారీ కాన్పూర్ కోర్టులో కొత్తగా ఫిర్యాదు చేశారు. తనను వరకట్నం కోసం వేధించడమే కాకుండా, శారీరకంగా, మానసికంగా హింసించారని, ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ మిశ్రాతో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడు మరియు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను కూడా ఆమె ఈ పిటిషన్‌లో చేర్చారు.
గరిమా తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరికీ 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. మూడేళ్ల పాటు ప్రేమించుకున్నాక 2021 ఏప్రిల్ 26న కాన్పూర్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే అమిత్ మిశ్రా కుటుంబం హోండా సిటీ కారుతో పాటు 10 లక్షల రూపాయల అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టిందని ఆమె ఆరోపించారు. ఆమె కుటుంబం 2.5 లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ, వారి వేధింపులు ఆగలేదని ఆమె వాపోయారు.
అమిత్ మిశ్రా తరచుగా మద్యం సేవించి తనపై దాడి చేసేవాడని, తనను తిట్టడమే కాకుండా కొన్నిసార్లు భోజనం కూడా పెట్టకుండా ఉంచేవాడని గరిమా ఆరోపించారు. తాను మోడలింగ్ ద్వారా సంపాదించిన డబ్బును కూడా అతను లాక్కునేవాడని, విడాకులు ఇస్తానని బెదిరించేవాడని ఆమె తెలిపారు. ఈ వేధింపుల వల్ల తాను తీవ్రమైన ఒత్తిడికి గురై కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని, ఒకానొక దశలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఆమె కోర్టుకు వివరించారు.
అమిత్ మిశ్రాకు ఉన్న ప్రభావం వల్ల పోలీసులు కేసు నమోదు చేయలేదని, అందుకే తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గరిమా పేర్కొన్నారు. గతంలోనే ఆమె అమిత్ మిశ్రాపై గృహహింస కేసు మరియు నెలకు 50 వేల రూపాయల భరణం కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌గా పనిచేస్తున్న అమిత్ మిశ్రాపై ఈ వరుస న్యాయపోరాటాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

