Archery World Cup: ఆర్చరీ వరల్డ్ కప్: ధీరజ్ బొమ్మదేవర గోల్డెన్ డబుల్
ధీరజ్ బొమ్మదేవర గోల్డెన్ డబుల్

Archery World Cup: ప్రపంచ ఆర్చరీ వేదికపై భారత్ సత్తా చాటింది! శత్రువు ఎంతటి బలవంతుడైనా.. గురి తప్పని బాణంతో లొంగదీసుకోవచ్చని నిరూపించాడు మన తెలుగు తేజం, ఇండియా స్టార్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో ధీరజ్ ఏకంగా ‘గోల్డెన్ డబుల్’ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు.. కొన్ని గంటల వ్యవధిలోనే రెండు ప్రతిష్టాత్మక బంగారు పతకాలను దేశానికి అందించి, ఆర్చరీ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు.
ఆదివారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ పోరు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ఎందుకంటే.. మన ధీరజ్ - కుంకుమ్ మోహోద్ ద్వయం తలపడింది సామాన్యులతో కాదు.. ఒలింపిక్ ఛాంపియన్లయిన సౌత్ కొరియాకు చెందిన కిమ్ జెడయోక్, ఓ యో జిన్ జోడీతో. కానీ, మన విలుకాండ్లు ఏమాత్రం బెదరలేదు. తొలి సెట్‌లోనే కొరియా ఆర్చర్ తడబడగా.. కుంకుమ్ సూపర్ గురితో 10 పాయింట్లు సాధించి భారత్‌కు 37-36తో 2-0 ఆధిక్యాన్ని అందించింది. ఇక రెండో సెట్‌లో కొరియా టీమ్ 36 పాయింట్లు సాధించగా.. భారత్ గెలవాలంటే చివరి బాణానికి ఖచ్చితంగా 10 పాయింట్లు కావాలి. ఆ ఒత్తిడిని చిత్తు చేస్తూ ధీరజ్ పర్ఫెక్ట్ 10 కొట్టాడు. దాంతో రెండో సెట్ కూడా మనదే అయింది.. ఆధిక్యం 4-0కు పెరిగింది!"
అయితే మూడో సెట్‌లో కొరియా జోడీ పుంజుకుని రెండు 10లతో 39 పాయింట్లు సాధించింది. మ్యాచ్ ఉత్కంఠ రేపుతున్న వేళ.. తీవ్రమైన ఒత్తిడిలోనూ కుంకుమ్, ధీరజ్ ఇద్దరూ బ్యాక్-టు-బ్యాక్ 10 పాయింట్లు సాధించి అద్భుతం చేశారు! దాంతో ఆ సెట్ 39-39తో డ్రా అయింది. నిర్ణయాత్మక పాయింట్‌తో భారత్ 5-1 తేడాతో ఒలింపిక్ ఛాంపియన్లను మట్టికరిపించి.. స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచం మొత్తం ఈ సంచలన విజయానికి షాక్ అయింది.
మిక్స్‌డ్ టీమ్‌లో గోల్డ్ గెలిచిన కొన్ని గంటలకే.. ధీరజ్ మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో బరిలోకి దిగాడు. అక్కడ కూడా కొరియాకు చెందిన లీ వూ సీక్‌తో తలపడ్డాడు. ఒంటరి పోరాటంలోనూ ధీరజ్ బాణాలు బుల్లెట్లలా దూసుకెళ్లాయి. కొరియా ఆర్చర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 7-3తో షాకిచ్చాడు. ధీరజ్ కెరీర్‌లోనే ఇది మొట్టమొదటి‘వ్యక్తిగత వరల్డ్ కప్ గోల్డ్ మెడల్’ కావడం విశేషం.

