Arjun Tendulkar: నిశ్చితార్థం తర్వాత అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్
అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు యువ క్రికెటర్ అర్జున్ తెందూల్కర్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కర్ణాటక క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో గోవా జట్టు తరఫున ఆడిన అర్జున్, తన బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహారాష్ట్ర జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జున్ తొలి బంతికే వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. అతని పదునైన బౌలింగ్ దెబ్బకు మహారాష్ట్ర జట్టు కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. ఈ ప్రదర్శనతో అర్జున్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన అర్జున్
బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన తర్వాత, అర్జున్ బ్యాటింగ్‌లోనూ తన ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మహారాష్ట్రను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన గోవా, తమ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ కేవలం 44 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించాడు. అతని సహకారంతో గోవా జట్టు 197 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.
