Ashes Series: యాషెస్ సిరీస్.. 152 పరుగులకే ఆసిస్ ఆలౌట్
152 పరుగులకే ఆసిస్ ఆలౌట్

Ashes Series: ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకమైన 'బాక్సింగ్ డే టెస్ట్' (Boxing Day Test) ప్రారంభమైంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో యాషెస్ టెస్ట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది.
ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆసీస్ టాపార్డర్‌ను దెబ్బతీశారు.ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మిచెల్ నీజర్ 35 పరుగులు మినహా మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయారు.ట్రావిస్ హెడ్ (12), స్టీవ్ స్మిత్ (5), మార్నస్ లబుషేన్ (6) వంటి స్టార్ బ్యాటర్లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ (Josh Tongue) 5 వికెట్లతో, గస్ అట్కిన్సన్ (Gus Atkinson) 2 వికెట్లతో ఆసీస్‌ను కుప్పకూల్చారు.
ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి మూడు టెస్టులను గెలుచుకుని 3-0 ఆధిక్యంలో ఉంది. తద్వారా యాషెస్ కప్‌ను ఆస్ట్రేలియా తన వద్దే నిలుపుకుంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు కేవలం పరువు కోసం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల కోసం మాత్రమే కీలకం.
రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కావడంతో, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లైన్ కూడా అందుబాటులో లేరు, అతని స్థానంలో ఆసీస్ పూర్తిస్థాయి పేస్ అటాక్‌తో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ జట్టులో ఓలీ పోప్ స్థానంలో యువ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్ టెస్ట్ అరంగేట్రం చేశారు.

