Ashwin: నితీశ్ రాణా క్రీడా స్ఫూర్తిపై అశ్విన్ ప్రశంసలు..
అశ్విన్ ప్రశంసలు..

Ashwin: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన ఒక వివాదం ఇప్పుడు క్రీడా స్ఫూర్తిపై చర్చకు దారితీసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీశ్ రాణా, సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ ఆటగాడు దిగ్వేశ్ రాఠీ మధ్య జరిగిన వాగ్వాదం నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై నితీశ్ రాణా స్పందించిన తీరు పట్ల భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘మనకిష్టమైన ఆటలో బౌలర్ల ప్రవర్తనను మనం అంత త్వరగా ఇష్టపడం. డీపీఎల్‌లో నితీశ్-దిగ్వేశ్ మధ్య జరిగిన ఫైట్‌లో తప్పు స్పిన్నర్‌దే కావొచ్చు లేదా కాకపోవచ్చు. కానీ నితీశ్ దగ్గర దిగ్వేశ్‌పై నింద మోపే అవకాశం ఉంది. అయినప్పటికీ నితీశ్ చాలా చక్కగా స్పందించాడు’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. ‘‘ఆ మ్యాచ్‌లో నితీశ్ 15 సిక్స్‌లు కొట్టి తన జట్టును గెలిపించాడు. మ్యాచ్ తర్వాత ఈ వివాదం గురించి అడిగినప్పుడు, 'ఇక్కడ తప్పు తనదా? దిగ్వేశ్‌దా? అనేది ముఖ్యం కాదు. మేమిద్దరం మా జట్టు విజయం కోసమే పోరాడుతాం. ఇలాంటి సందర్భాలలో వాతావరణం వేడెక్కడం మ్యాచ్‌కు మంచిదే’’ అని అన్నాడు. ఈ స్పందన నాకు అతనిపై గౌరవాన్ని పెంచిందని అశ్విన్ వివరించారు.
దిగ్వేశ్‌పై బురద చల్లే అవకాశం ఉన్నప్పటికీ నితీశ్ అలా చేయలేదని, సహచర ఆటగాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరచడం సరికాదని నితీశ్ మాటలు చాటిచెప్పాయని అశ్విన్ ప్రశంసించారు.
వివాదం ఎలా మొదలైంది?
ఎలిమినేటర్ మ్యాచ్‌లో దిగ్వేశ్ రాఠీ బౌలింగ్ వేసేందుకు వచ్చి, బంతిని విసరకుండా వెనక్కి వెళ్లిపోయాడు. అప్పుడు షాట్ కోసం సిద్ధంగా ఉన్న నితీశ్ రాణా చివరి క్షణంలో పక్కకు వైదొలిగాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు కవ్వించుకున్నారు. ఆ తర్వాత దిగ్వేశ్ వేసిన బంతికి నితీశ్ సిక్స్ కొట్టి, వికెట్ తీసినప్పుడు దిగ్వేశ్ చేసే విధంగా 'నోట్‌బుక్' సెలబ్రేషన్స్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన దిగ్వేశ్ నోరు జారగా, నితీశ్ కూడా గట్టిగా బదులిచ్చాడు. చివరికి తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఈ వివాదం తర్వాత కూడా సంయమనం పాటిస్తూ నితీశ్ రాణా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయి.
