బీసీసీఐకి క్షమాపణ చెప్పిన నఖ్వీ..

Asia Cup Trophy: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత నెలకొన్న ట్రోఫీ, మెడల్స్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టైటిల్‌ను గెలిచినా సరే.. ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్‌ను తీసుకోవడానికి భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో వాటిని ఆయన తనతోపాటు ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లడం వివాదానికి దారితీసింది.

ఈ పరిణామంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలోనూ ఘాటుగా స్పందించింది. అక్కడ కూడా మోసిన్ నఖ్వీ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా.. నఖ్వీ కాస్త వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ ఫైనల్‌ సమయంలో అనంతరం జరిగిన పరిణామాలపై ఆయన బీసీసీఐకి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయితే ట్రోఫీ అందజేత విషయంలో మాత్రం మోసిన్ నఖ్వీ స్పష్టత ఇవ్వడం లేదు.

ఇప్పటికే ట్రోఫీ, మెడల్స్‌ను తనతోపాటు ఉంచుకున్న ఆయన వాటిని భారత్‌కు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించడం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బీసీసీఐకి ఇవ్వకుండా భారత సారథి లేదా ప్రతినిధే తన ఆఫీస్‌కు వచ్చి తీసుకోవాలని నఖ్వీ పట్టుబడుతున్నట్లు సమాచారం. నఖ్వీ మరోసారి ఇలాంటి ప్రతిపాదనే తీసుకురావడంతో, ఇది తమకు అవమానకరం అని భావించిన బీసీసీఐ.. ఈ వ్యవహారాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story