Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 అథ్లెటిక్స్ ట్రాక్‌పై భారత స్టార్ రన్నర్ పారుల్ చౌదరి సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆమె, తన పేరిట ఉన్న జాతీయ రికార్డును తానే తిరగరాస్తూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

చరిత్ర సృష్టించిన టైమింగ్: 9 నిమిషాల 10 సెకన్ల రికార్డు బ్రేక్

పారుల్ చౌదరి ఈ రేసును కేవలం 9 నిమిషాల 08.67 సెకన్లలో ముగించి తన వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో 9 నిమిషాల 10 సెకన్ల కంటే తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ఆమె సరికొత్త మైలురాయిని అందుకున్నారు. గతంలో 2025లో నమోదైన తన పాత జాతీయ రికార్డు (9:12.46) సమయాన్ని దాదాపు నాలుగు సెకన్ల తేడాతో అధిగమించి ఈ ఘనత సాధించారు.

పోడియం ఫలితాలు

ప్రపంచ స్థాయి రన్నర్ల మధ్య తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ రేసులో బహ్రెయిన్ స్టార్ రన్నర్ విన్‌ఫ్రెడ్ యావి 9:04.36 సమయంతో కొత్త ఆసియా క్రీడల రికార్డును సృష్టించి గోల్డ్ మెడల్ సాధించారు. కజకిస్థాన్‌కు చెందిన నోరా జెరుటో తానుయ్ 9:06.82 సమయంతో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారుహ పారుల్ చౌదరి 9:08.67 సమయంతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు.

ఇదే ఈవెంట్‌లో పోటీపడ్డ మరో యువ భారత అథ్లెట్ అంకిత 9:19.24 సెకన్లలో రేసు పూర్తి చేసి, తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌తో 4వ స్థానంలో నిలిచారు.

చెప్పులు లేని పరుగుల నుంచి డీఎస్పీ స్థాయికి..

ఉత్తరప్రదేశ్ మీరట్ సమీపంలోని ఇకలౌతా గ్రామానికి చెందిన పారుల్ చౌదరి ప్రస్థానం ఎందరికో ఆదర్శం. చిన్నతనంలో సరైన వనరులు లేకపోయినా 2011లో స్కూల్ స్థాయి పోటీల్లో చెప్పులు కూడా లేకుండా 800 మీటర్ల పరుగుతో ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1500 మీటర్లు, 3000 మీటర్లు, 5000 మీటర్ల విభాగాల్లో రాణిస్తూ స్టీపుల్‌చేజ్‌ను తన ప్రధాన క్రీడగా ఎంచుకున్నారు.

ఆమె అంకితభావానికి గుర్తింపుగా 2015లో రైల్వేస్ ఉద్యోగం లభించగా, 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఆమె చూపిన ప్రతిభకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాతో సత్కరించింది. ప్రస్తుతం మురాదాబాద్‌లో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారుల్, మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచారు.

Next Story