Asian Games 2026: ఆసియా క్రీడలు 2026: వర్షం పడి సెమీఫైనల్ రద్దయితే భారత్‌దే ఫైనల్ బెర్త్.. ఐసీసీకి భిన్నంగా ఆసియాడ్ నిబంధనలు..
ఐసీసీకి భిన్నంగా ఆసియాడ్ నిబంధనలు..

Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల టీ20 క్రికెట్ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు అదిరిపోయే జోరును కొనసాగిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన, సెప్టెంబర్ 20న జరిగే రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే జపాన్‌లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి రద్దయితే ఫైనల్‌కు ఎవరు చేరుకుంటారు?
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ ప్రధాన టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్‌లకు సాధారణంగా రిజర్వ్ డే కేటాయిస్తారు. కానీ ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ నిబంధనలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. టోర్నమెంట్ అధికారిక షెడ్యూల్ ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డే కేటాయించలేదు. వర్షం వల్ల మ్యాచ్ ఫలితం తేలడానికి కనీస ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే, మ్యాచ్‌ను రద్దుగా ప్రకటిస్తారు.
సీడింగ్ - ర్యాంకింగ్ ప్రాతిపదిక: ఒకవేళ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఫలితం తేలకుండా రద్దయిత టోర్నమెంట్‌లో అధిక సీడింగ్, ఐసీసీ అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు నేరుగా విజేతగా నిలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌తో పాటు టోర్నీ సీడింగ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్ కంటే ఎంతో ముందంజలో ఉంది. కాబట్టి మ్యాచ్ రద్దయితే టీమ్ ఇండియా ఎటువంటి శ్రమ లేకుండా నేరుగా గోల్డ్ మెడల్ మ్యాచ కు చేరుకుంటుంది.
ఇదే నిబంధనతో సెమీస్‌కు చేరిన బంగ్లాదేశ్..
విశేషమేమిటంటే, ప్రత్యర్థి బంగ్లాదేశ్ కూడా సరిగ్గా ఇదే నిబంధన ఆధారంగానే సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, చైనాతో తలపడాల్సి ఉంది. అయితే నిరంతరాయంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఆ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడకుండానే రద్దయింది. దీంతో మెరుగైన సీడింగ్ సాధించిన జట్టుగా బంగ్లాదేశ్ అధికారికంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
భారత్‌కు తిరుగులేని రికార్డు
శుక్రవారం నగోయాలోని కొరొబోగీ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన జపాన్‌ను భారత స్పిన్నర్లు 19.5 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం బరిలోకి దిగిన టీమ్ ఇండియా, ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ తో కేవలం 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది.
ఆదివారం జరిగే సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌పై గెలిచి దర్జాగా ఫైనల్‌కు వెళ్లాలని భారత్ భావిస్తోంది. ఒకవేళ వరుణుడు అడ్డుపడినా, టోర్నీ నిబంధనల రక్షణతో ఫైనల్ చేరే అవకాశాలు నూటికి నూరు శాతం భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయి.

