Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత ద్వయం కమల్‌జీత్, సురుచి సింగ్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. మహిళల క్రికెట్ జట్టు సాధించిన పసిడి తర్వాత, ఈ క్రీడల్లో భారత్‌కు లభించిన రెండో స్వర్ణ పతకం ఇది.

ఫైనల్లో పూర్తి ఆధిపత్యం

క్వాలిఫికేషన్ రౌండ్‌లో 587 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జోడీ, తుది పోరులోనూ అదే జోరు కొనసాగించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కమల్‌జీత్, సురుచి ద్వయం ఏకంగా 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

గట్టి పోటీ ఇచ్చిన దక్షిణ కొరియా జట్టు 478.0 పాయింట్లతో రజత పతకానికి పరిమితమైంది. కొరియా ద్వయం కంటే 6.6 పాయింట్ల భారీ ఆధిక్యంతో భారత షూటర్లు విజేతలుగా నిలిచారు. ఇక ఇరాన్ జోడీ 415.8 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

నిరాశను అధిగమించి చారిత్రక విజయం

వ్యక్తిగత విభాగాల్లో ఆశించిన ఫలితాలు రాక నిరాశపరిచినప్పటికీ, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఇద్దరూ అద్భుతంగా పుంజుకున్నారు. ఈ విజయంతో ఆసియా క్రీడల షూటింగ్ పిస్టల్ విభాగంలో భారత్ పతకాల బోణీ కొట్టడమే కాకుండా, పతకాల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. చారిత్రక ప్రదర్శనతో స్వర్ణం ముద్దాడిన ఈ యువ జోడీపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story