మొయిన్ అలీ వార్నింగ్

Auction of 'The Hundred' players: వచ్చే నెలలో జరగబోయే 'ది హండ్రెడ్' ప్లేయర్ల వేలంలో పాకిస్థాన్ ఆటగాళ్లను కావాలనే పక్కన పెడితే తామంతా కలిసి నిరసన తెలుపుతామని ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ హెచ్చరించారు. ఈ టోర్నీలో ఉన్న ఎనిమిది జట్లలో నాలుగు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు (భారతీయులు) కొనుగోలు చేశారు. భారత్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల ఈ నాలుగు జట్లు (MI లండన్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ లీడ్స్, సదరన్ బ్రేవ్) పాక్ ప్లేయర్లను కొనకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మొయిన్ అలీ ఘాటుగా స్పందించారు.

"యూకేలో ఇలాంటి వివక్ష జరుగుతుందని నేను అనుకోను, ఒకవేళ జరిగితే అది చాలా దారుణం. పాకిస్థాన్ ఆటగాళ్లని కేవలం వారి దేశం కారణంగా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఈ విషయంపై ఆటగాళ్లందరం కలిసి మాట్లాడతాం. కేవలం పాక్ మూలాలు ఉన్నవాళ్లే కాదు, వివక్షను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ నోరు విప్పాలి" అని మొయిన్ అలీ స్పష్టం చేశారు. చాలా మంది ప్లేయర్లు తమ కెరీర్ పాడవుతుందేమోనని, ఐపీఎల్ ఓనర్లతో గొడవ ఎందుకని భయపడి మాట్లాడటం లేదని, కానీ తనలాంటి సీనియర్లకు అలాంటి భయాలు లేవని ఆయన అన్నారు.

దక్షిణాఫ్రికాలో జరిగే SA20, యూఏఈలో జరిగే ILT20 లీగ్‌లలో కూడా ఇండియన్ ఓనర్లే జట్లను నడుపుతున్నారు. అక్కడ కూడా ఒక్క పాక్ ఆటగాడిని కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు 'ది హండ్రెడ్'లో కూడా ఇదే 'అలిఖిత నియమాన్ని' పాటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 63 మంది పాక్ ప్లేయర్లు ఈ వేలం కోసం పేరు నమోదు చేసుకున్నారు. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ వంటి స్టార్ల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ గొడవ పెద్దది కావడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) రంగంలోకి దిగింది. ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు జాతీయతను బట్టి వివక్ష చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని జట్ల ఓనర్లకు మెయిల్ పంపింది. ఒకవేళ ఎవరైనా కావాలనే పాక్ ప్లేయర్లను పక్కన పెట్టినట్లు ఆధారాలు దొరికితే.. స్వతంత్ర క్రికెట్ రెగ్యులేటర్‌కు ఈ విషయాన్ని అప్పగిస్తామని హెచ్చరించింది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్, మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా పాక్ ప్లేయర్లను దూరం పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story