Women's T20 World Cup Final: మహిళల టీ20 ప్రపంచ కప్‌‌లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది! లండన్‌‌లోని ప్రఖ్యాత 'ది ఓవల్' మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. ఆస్ట్రేలియా ఘనంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల జట్టును ఆసీస్ బౌలర్లు చుట్టేశారు. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి విండీస్‌ను కేవలం 125 పరుగులకే కట్టడి చేశారు. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్‌‌ హేలీ మాథ్యూస్‌‌ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆసీస్ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, గార్డెనర్‌‌, జార్జియా వేర్‌‌హామ్ చెరో రెండు వికెట్లతో అదరగొట్టారు.

అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ బెత్ మూనీ కేవలం 36 బంతుల్లోనే 61 రన్స్ చేసి విధ్వంసం సృష్టించింది. ఈ హాఫ్ సెంచరీతో మహిళల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీల రికార్డును సాధించిన న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ సరసన మూనీ చేరింది.

ఆమెకు తోడుగా యాష్ గార్డనర్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వీరిద్దరూ కలిసి కేవలం 37 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి.. ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండగానే, కేవలం 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన ఆష్లీ గార్డనర్‌‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు జరిగిన 10 మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో.. ఏకంగా ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారం జరిగే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ విజేతతో.. వచ్చే ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా తన ఏడో ప్రపంచ కప్ టైటిల్ కోసం తలపడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story