ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మహాపోరు!

Australia vs England: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీస్‌లలో ఒకటైన 'యాషెస్' సమరం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నేడు పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్‌కు అసలైన అందం, ఉద్విగ్నతను తీసుకొచ్చే ఈ పోరు కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సొంతగడ్డపై యాషెస్‌ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియాకు ఈ టెస్టుకు ముందు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయాల కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యారు. వారి స్థానంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.స్మిత్ నేతృత్వంలో ఓపెనర్‌గా జేక్ వెదెరాల్డ్,పేసర్‌గా బ్రెండన్ డాగెట్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను ఇప్పుడు మిచెల్ స్టార్క్, డాగెట్, స్కాట్ బోలాండ్‌లు మోయనున్నారు.ఇంగ్లండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఆ జట్టు దూకుడుగా బజ్‌బాల్ శైలితో బరిలోకి దిగనుంది. గత మూడు ఆస్ట్రేలియా పర్యటనల్లో ఘోర పరాజయాలను చవిచూసిన ఇంగ్లండ్‌, ఈసారి మాత్రం యాషెస్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. గాయం నుంచి కోలుకున్న పేసర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ జట్టులోకి తిరిగిరావడం ఇంగ్లండ్‌కు పెద్ద బలం. వీరు ఆస్ట్రేలియా బ్యాటర్లకు సవాల్ విసిరే అవకాశం ఉంది. గత పర్యటనల్లో విఫలమైనప్పటికీ, కెప్టెన్ స్టోక్స్,కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ నేతృత్వంలో దూకుడుగా ఆడే విధానం వారికి అదనపు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. యాషెస్ చరిత్రలో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం, కొత్త ఆటగాళ్ల అరంగేట్రం వంటి పరిణామాల నేపథ్యంలో, ఈ పోరు మరింత హోరాహోరీగా, రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్‌లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్‌గా యాషెస్‌లో ఆసీస్‌దే పైచేయి కావడం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story