Australian Women's Team: సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మహిళా టీమ్..
ఆస్ట్రేలియా మహిళా టీమ్..

Australian Women's Team: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టాపార్డర్ కుప్పకూలినప్పటికీ.. తొమ్మిదో వికెట్‌కు వందకు పైగా స్కోరు జతచేసిన ప్రపంచంలోనే తొలి జట్టుగా ఆసీస్ ఘనత సాధించింది.
ప్రపంచ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా, పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడుతోంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
టాపార్డర్ కుదేలైనా.. సెంచరీతో బెత్ మూనీ మెరుపు
పాకిస్తాన్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా టాపార్డర్ పూర్తిగా కుదేలైంది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10) తో పాటు ఎలిస్ పెర్రీ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను.. నాలుగో స్థానంలో వచ్చిన బెత్ మూనీ ఆదుకుంది. మిగతా బ్యాటర్లు విఫలమైనా, మూనీ మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరుస్తూ సెంచరీ (114 బంతుల్లో 109) చేసింది. ఆమెకు పదో స్థానంలో వచ్చిన అలనా కింగ్ (49 బంతుల్లో 51 నాటౌట్) మంచి సపోర్ట్ ఇచ్చింది.
తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం
బెత్ మూనీ, అలనా కింగ్ కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 106 పరుగులు జోడించారు. తద్వారా మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు. 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 222 పరుగులు చేసింది. అంతేకాకుండా ఏడు వికెట్లు పడిన తర్వాత అత్యధిక పరుగులు (145 పరుగులు) సాధించిన జట్టుగానూ ఆసీస్ నిలిచింది.
ఆస్ట్రేలియా పేరిటే రెండు రికార్డులు!
మహిళల క్రికెట్‌లో తొమ్మిదో వికెట్‌కు రికార్డు సాధించిన ఆస్ట్రేలియా, అంతకుముందు పురుషుల క్రికెట్‌లో కూడా ఇదే తరహా ఘనతను సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వేళ.. గ్లెన్ మాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ కలిసి ఎనిమిదో వికెట్‌కు 202 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించింది.
