Axar Patel Questions Impact Player Rule: ఐపీఎల్‌లో ప్రవేశపెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ పట్ల అగ్రశ్రేణి భారత క్రికెటర్లలో అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పటికే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఈ నిబంధనను వ్యతిరేకించగా, తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా తన గళాన్ని వినిపించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రీ-సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ రూల్ తనకు అస్సలు నచ్చలేదని కుండబద్దలు కొట్టారు.

"ఆల్‌రౌండర్‌గా నాకు ఇది నచ్చదు!"

నవ్వుతూనే తన అసహనాన్ని వ్యక్తం చేసిన అక్షర్ పటేల్.. "నేనొక ఆల్‌రౌండర్‌ని, అందుకే ఈ రూల్ నాకు నచ్చదు. గతంలో జట్లు బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండూ చేయగల ఆల్‌రౌండర్ల కోసం వెతికేవి. కానీ ఇప్పుడు మేనేజ్‌మెంట్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా బౌలర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంటోంది. 'మాకు ఆల్‌రౌండర్ ఎందుకు?' అనే ధోరణి కనిపిస్తోంది" అని వివరించారు. వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా, నిబంధనలు కాబట్టి పాటించక తప్పదని ఆయన పేర్కొన్నారు.

బౌలింగ్ ఎందుకు తగ్గింది?

గత సీజన్‌లో అక్షర్ తక్కువ ఓవర్లు వేయడంపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కాదని, తన వేలికి అయిన గాయం కారణమని స్పష్టం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత బంతి కుట్లు (seam) తగిలి తన స్పిన్నింగ్ ఫింగర్ లోతుగా తెగిందని, దానివల్ల బంతిని గ్రిప్ చేయడం, రొటేట్ చేయడం కష్టమైందని చెప్పారు. అందుకే మొదట్లో తక్కువ ఓవర్లు వేసి, గాయం నయమయ్యాక మళ్లీ పూర్తిస్థాయిలో బౌలింగ్ చేశానని తెలిపారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు తన కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించడమే లక్ష్యంగా అక్షర్ ఈ సీజన్ బరిలోకి దిగుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story