Babar Azam: విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజం
వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజం

Babar Azam: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బాబర్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు చేయడం ద్వారా బాబర్ తన కెరీర్‌లో 39వ టీ20 అర్ధసెంచరీని నమోదు చేశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక ఫిఫ్టీలు బాదిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. బాబర్ ఈ మార్కును 139 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, కోహ్లీ 125 ఇన్నింగ్స్‌ల్లోనే 38 ఫిఫ్టీలు సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు టీ20ల నుంచి రిటైర్ అవ్వడంతో, బాబర్ తన రికార్డును మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
అయితే బాబర్ ఈ రికార్డు సృష్టించినప్పటికీ, అతని స్ట్రైక్ రేట్ మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు బంతులు ఆడిన పాక్ ఆటగాళ్లందరిలో బాబర్ స్ట్రైక్ రేటే అత్యల్పంగా ఉండటం గమనార్హం. గత బిగ్ బాష్ లీగ్‌లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే పిచ్‌లపై వేగంగా ఆడలేకపోవడం బాబర్‌కు పెద్ద మైనస్‌గా మారింది. రాబోయే 2026 టీ20 ప్రపంచకప్ శ్రీలంకలోని ఫ్లాట్ పిచ్‌లపై జరగనున్న నేపథ్యంలో, పాక్ బౌలర్లు మ్యాచ్‌లను గెలిపించినా.. బ్యాటింగ్ విభాగంలో బాబర్ తన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 207/6 భారీ స్కోరు సాధించింది. ఆరంభంలోనే ఫఖర్ జమాన్ (10), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) వికెట్లు కోల్పోయినా.. సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజం (50*) మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ కేవలం 19 బంతుల్లోనే 46 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో పాక్ స్కోరు 200 దాటింది. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో పాకిస్థాన్ ఏకంగా 70 పరుగులు రాబట్టడం విశేషం.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు పాక్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. షాహీన్ షా అఫ్రిది వేసిన తొలి ఓవర్లలోనే కెప్టెన్ మిచెల్ మార్ష్ (1) క్లీన్ బౌల్డ్ కావడంతో పతనం మొదలైంది. స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ తన కెరీర్ బెస్ట్ స్పెల్ (5/18)తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ వెన్నెముకను విరిచాడు. మాథ్యూ షార్ట్, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ వంటి కీలక వికెట్లను తీసి ఆసీస్‌ను కోలుకోనీయకుండా చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయి, 111 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో పాకిస్థాన్ 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

