రికార్డు సమం చేసిన బాబర్ ఆజామ్

Babar Azam: రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఆదివారం పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరిగిన త్రి-సిరీస్ నాలుగో T20I మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసిన బాబర్ ఆజామ్ భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలోని పాకిస్తాన్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ ఆజామ్ 52 బంతుల్లో 74 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో బాబర్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌తో (41 బంతుల్లో 63) కలిసి రెండో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తన 74 పరుగుల ఇన్నింగ్స్‌తో బాబర్ ఆజామ్.. T20Iలలో అత్యధిక అర్ధసెంచరీలు (50+) చేసిన విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ కోహ్లీ125 T20I మ్యాచ్‌లలో 38 అర్ధసెంచరీలు చేయగా.. బాబర్ ఆజామ్ 134 T20I మ్యాచ్‌లలో ఇప్పుడు 38 అర్ధసెంచరీలు చేశారు. అత్యధిక T20I అర్ధసెంచరీల జాబితాలో బాబర్, కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (32), మహ్మద్ రిజ్వాన్ (30) ఉన్నారు. ఇక బాబర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 195/5 భారీ స్కోరు సాధించింది. అనంతరం జింబాబ్వేను 19 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ చేసి 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్ 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వరుసగా మూడు విజయాలు సాధించిన పాకిస్తాన్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్ గురువారం (నవంబర్ 27) శ్రీలంకతో తలపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story