Hazlewood Also Ruled Out: టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ టోర్నీకి దూరం కాగా, తాజాగా మరో కీలక పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తేలింది. కాలి మడమ నొప్పితో బాధపడుతున్న హేజిల్‌వుడ్, ఆ గాయం నుండి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం. అతను ఫిట్‌నెస్ సాధించడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో కీలక బౌలర్లు దూరం కావడం ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశమే. అయితే, హేజిల్‌వుడ్ అందుబాటులో లేని మ్యాచుల్లో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు రిజర్వ్ పేసర్ సీన్ అబాట్‌ను జట్టులోకి తీసుకున్నారు. అబాట్ తన వేగంతో హేజిల్‌వుడ్ లోటును ఎంతవరకు పూడుస్తాడో వేచి చూడాలి. వరుస గాయాల పాలవుతున్న ఆటగాళ్ల జాబితా ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌ను ప్రస్తుతం కలవరపెడుతోంది. 2016 నుండి 2020 వరకు దాదాపు నాలుగేళ్ల పాటు టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ, తిరిగి వచ్చిన తర్వాత అతను అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. పునరాగమనం తర్వాత 20.44 సగటుతో, 7.57 ఎకానమీతో ఏకంగా 133 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటారు.

అంతర్జాతీయ టీ20లలో కూడా హేజిల్‌వుడ్ రికార్డు అమోఘం. కేవలం 60 మ్యాచ్‌ల్లోనే 79 వికెట్లు తీసి ఆసీస్ ప్రధాన బౌలర్‌గా ఎదిగారు. గత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. ప్రస్తుతం జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్ ఆయనే కావడం విశేషం. కీలకమైన ప్రపంచకప్ మ్యాచుల్లో అలాంటి సీనియర్ బౌలర్ సేవలను కోల్పోవడం ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story