Olympics Sparks Debate: అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యంపై గత కొంతకాలంగా జరుగుతున్న సుదీర్ఘ చర్చకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) తెరదించింది. మహిళా క్రీడాకారుల హక్కులను మరియు క్రీడల్లో సమానత్వాన్ని కాపాడే ఉద్దేశంతో, ట్రాన్స్ ఉమెన్ (పురుషులుగా పుట్టి మహిళలుగా మారిన వారు) ఇకపై ఒలింపిక్స్‌లో మహిళల కేటగిరీలో పోటీ పడకూడదని ఐఓసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయం వెనుక శాస్త్రీయమైన కారణాలను ఐఓసీ విశ్లేషించింది. పురుషులుగా పుట్టి యుక్తవయస్సు దాటిన వారిలో శారీరక దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం , కండరాల బలం సహజంగానే మహిళల కంటే ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ థెరపీ తీసుకున్నప్పటికీ, ఈ శారీరక అనుకూలతలు (Biological Advantage) పూర్తిగా తగ్గిపోవని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల పుట్టుకతో మహిళలైన క్రీడాకారిణులకు అన్యాయం జరుగుతుందని, క్రీడల్లో ఉండే 'ఫెయిర్ ప్లే' సిద్ధాంతం దెబ్బతింటుందని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. మహిళల విభాగంలో పోటీ పడే ప్రతి అథ్లెట్ తమ బయోలాజికల్ సెక్స్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం 'SRY జీన్ స్క్రీనింగ్' వంటి పరీక్షలను తప్పనిసరి చేయనున్నారు. అంటే, పుట్టుకతో మహిళలైన వారు మాత్రమే మహిళల కేటగిరీలో పథకాల కోసం వేటాడగలరు. కేవలం ట్రాన్స్‌జెండర్లే కాకుండా, శరీరంలో సహజంగానే పురుష హార్మోన్లు ఎక్కువగా ఉండే DSD అథ్లెట్లపై కూడా ఈ ప్రభావం పడనుంది.

ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా క్రీడాకారిణులు,చాలా దేశాల క్రీడా సమాఖ్యలు దీనిని స్వాగతిస్తుండగా.. మానవ హక్కుల కార్యకర్తలు ,ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మాత్రం దీనిని వివక్షగా భావిస్తోంది. క్రీడల్లో అందరికీ సమాన అవకాశం ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ, క్రీడల సమగ్రతను కాపాడటమే తమ ప్రాధాన్యతని ఐఓసీ తేల్చి చెప్పింది.

Next Story