క్షమాపణ చెబితే మైదానంలోకి!

Bangladesh Cricket Board (BCB): బంగ్లాదేశ్ క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాలను బహిష్కరిస్తామని ప్రకటించిన ఆటగాళ్లు ఇప్పుడు తమ పంతంపై కాస్త మెత్తబడ్డారు. బోర్డు డైరెక్టర్ తన వ్యాఖ్యలకు గాను బహిరంగ క్షమాపణ చెబితే, తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమని క్రికెటర్ల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది.

ఇటీవల బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్న నజ్ముల్ ఇస్లాం, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను 'ఇండియన్ ఏజెంట్' అని సంబోధించడంతో వివాదం రాజుకుంది. అంతేకాకుండా, ఆటగాళ్ల ప్రదర్శన బాలేదని, టీ20 వరల్డ్ కప్ ఆడకపోయినా ఆటగాళ్లకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ అవమానకర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ క్రికెటర్లు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను బహిష్కరించారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన బీసీబీ, ఇప్పటికే నజ్ముల్ ఇస్లాంను ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పదవి నుండి తొలగించింది. అయితే, ఆయన బోర్డు డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆటగాళ్లు పట్టుబట్టారు. కాగా, తాజాగా జరిగిన చర్చల్లో ఆటగాళ్లు తమ పట్టును సడలించి, "నజ్ముల్ తన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెబితే ఆయనపై బోర్డు అంతర్గత విచారణ కొనసాగిస్తే.. తాము శుక్రవారం నుండి తిరిగి మైదానంలోకి వస్తాం" అని ప్రకటించారు.

మహిళల జట్టు వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఆడటం, పురుషుల అండర్-19 వరల్డ్ కప్, త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటగాళ్ల సంఘం తెలిపింది. క్రికెట్ భవిష్యత్తు, అభిమానుల కోరిక మేరకు ఈ రాజీకి వస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అయితే, నజ్ముల్ ఇస్లాం మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పేందుకు ప్రస్తుతం సిద్ధంగా లేరని సమాచారం, దీనితో బీసీబీ పెద్దలు ఈ సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story