Bangladesh Cricket Board (BCB): మేం ఇండియాకు రాం..వరల్డ్ కప్ మ్యాచ్ లు శ్రీలంకకు షిఫ్ట్ చేయండి
వరల్డ్ కప్ మ్యాచ్ లు శ్రీలంకకు షిఫ్ట్ చేయండి

Bangladesh Cricket Board (BCB): టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఒక అధికారిక లేఖ రాసింది. తమ జట్టు భారత్‌లో ఆడాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ బోర్డు ఐసీసీని కోరింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు సరైన భద్రత ఉండదని, ప్రస్తుత పరిస్థితులు తమ జట్టు ప్రయాణానికి అనుకూలంగా లేవని పేర్కొంది. ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు విడుదల చేయడంపై బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్‌కే రక్షణ లేనప్పుడు, మొత్తం జట్టు రావడం క్షేమకరం కాదని వారు వాదిస్తున్నారు.ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్-సిలో ఉంది. వారు ఆడాల్సిన 4 మ్యాచ్‌లలో 3 కోల్‌కతాలో, 1 ముంబైలో జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, వరల్డ్ కప్ ప్రారంభానికి కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పుడు వేదికలను మార్చడం "లాజిస్టికల్ పరంగా అసాధ్యం" అని తెలుస్తోంది. హోటల్ బుకింగ్స్, బ్రాడ్‌కాస్టింగ్ సెటప్ వంటివి ఇప్పటికే పూర్తయ్యాయని భారత్ పేర్కొంటోంది. ఐసీసీ ఈ విన్నపంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ బంగ్లాదేశ్ మొండికేస్తే, పాకిస్థాన్ మాదిరిగా వారి మ్యాచ్‌లను కూడా 'హైబ్రిడ్ మోడల్'లో శ్రీలంకలో నిర్వహిస్తారా లేక బంగ్లాదేశ్ వెనక్కి తగ్గుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.ఈ వివాదం వల్ల భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపై ఐసీసీ ఇచ్చే అధికారిక స్టేట్‌మెంట్ కోసం ఎదురుచూడాల్సిందే.

