BCCI : హైదరాబాద్ క్రికెటర్ రామ్ చరణ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం
బీసీసీఐ రెండేళ్ల నిషేధం

BCCI : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడిన మర్కట్ట రామ్ చరణ్ వివాదంలో చిక్కుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉండి వరుస సెంచరీలు బాదిన ఈ యువ ఆటగాడి కెరీర్‌కు ఈ నిషేధం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. విజయ్ మర్చంట్ ట్రోఫీ లీగ్ దశలో రామ్ చరణ్ వరుసగా ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర జట్లపై మూడు సెంచరీలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే అతని వయసుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హెచ్‌సీఏ విచారణ చేపట్టింది. ఈ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రామ్ చరణ్ వద్ద వేర్వేరు పుట్టిన తేదీలతో ఉన్న రెండు జనన ధృవీకరణ పత్రాలు ఉన్నట్లు విచారణలో తేలింది. అండర్-16 టోర్నీలో ఆడేందుకు వీలుగా తన అసలు వయసును తగ్గించి చూపాడని నిర్ధారణ అయ్యింది. వయసు మోసం విషయంలో జీరో టాలెన్స్ విధానాన్ని అనుసరించే బీసీసీఐ, రామ్ చరణ్‌పై పలు ఆంక్షలు విధించింది. అన్ని రకాల క్రికెట్ పోటీల నుండి అతడిని రెండేళ్ల పాటు బహిష్కరించింది. ఈ నిషేధం డిసెంబర్ 2027 వరకు అమల్లో ఉంటుంది. నిషేధ కాలం ముగిసిన తర్వాత రామ్ చరణ్ తిరిగి క్రికెట్ ఆడవచ్చు. అయితే అతను మరే ఇతర వయో పరిమితి విభాగాలలో ఆడేందుకు వీల్లేదు. నేరుగా సీనియర్ జట్టు తరఫున మాత్రమే బరిలోకి దిగాల్సి ఉంటుంది. నిజాయితీతో కూడిన క్రీడా స్ఫూర్తిని కాపాడటంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ, హెచ్‌సీఏ స్పష్టం చేశాయి.

