BCCI Brings Good News for IPL Fans: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. షెడ్యూల్లో భారీ మార్పులు!
షెడ్యూల్లో భారీ మార్పులు!

BCCI Brings Good News for IPL Fans: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. దేశంలో మండిపోతున్న వేసవి తీవ్రత, ఎండల వేడి నుంచి అటు క్రికెటర్లకు, ఇటు అభిమానులకు ఉపశమనం కలిగించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ను కాస్త ముందుగానే ప్రారంభించాలని బోర్డు గట్టిగా భావిస్తోంది.
భవిష్యత్ ఐపీఎల్ సీజన్ల కోసం మార్చి 10 నుంచి మే 15 వరకు ప్రత్యేక విండోను కేటాయించేలా ప్లాన్ చేస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్వయంగా వెల్లడించారు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్ ఇబ్బందుల వల్ల టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్యను ప్రస్తుతానికి 74కే పరిమితం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే ఆలోచన ప్రస్తుతానికైతే లేదన్నారు.కొత్త షెడ్యూల్‌ను రెండు వారాలు ముందుకు జరపడంపై బీసీసీఐ వర్గాల్లో, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఇప్పటికే తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
దీనికి గల కారణాలను సైకియా వివరిస్తూ... "ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభమై మే 31తో ముగిసింది. మే 15 దాటిన తర్వాత టోర్నీ చివరి దశకు వచ్చేసరికి దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉత్తర, పశ్చిమ భారత దేశాల్లో ఎండల తీవ్రత పీక్స్‌లో ఉంటోంది. ఇది అటు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు, ఇటు మైదానానికి వచ్చే ప్రేక్షకులకు ఏమాత్రం అనుకూలం కాదు" అని పేర్కొన్నారు.
అందుకే వచ్చే ఏడాది జరగబోయే మైలురాయి లాంటి 20వ ఐపీఎల్ ఎడిషన్ నాటికి... ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఎలాంటి వాతావరణ ఆటంకాలు లేకుండా, మే 15 లోపే టోర్నీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలనేది బీసీసీఐ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

