కీలక మార్పులు

BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2026-27 దేశీయ క్రికెట్ సీజన్ కోసం ప్లేయింగ్ కండిషన్స్‌లో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టింది. లండన్‌లోని మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ సిఫార్సు చేసిన నిబంధనలకు అనుగుణంగా ఈ మార్పులను రాష్ట్ర అసోసియేషన్లకు బీసీసీఐ సర్క్యులర్ ద్వారా పంపింది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై మ్యాచ్‌లో కోర్టు లేదా అంపైర్ నిర్ణయం మేరకు కావాలనే ఫ్రంట్ ఫూట్ నో-బాల్స్ లేదా నాన్-ల్యాండింగ్ డెలివరీలు వేసే బౌలర్లను ఇన్నింగ్స్ కాలం మాత్రమే కాకుండా, ఆ మ్యాచ్ మొత్తానికి సస్పెండ్ చేస్తారు. అలాగే రెడ్-బాల్ క్రికెట్‌లో ఆట ముగిసే సమయానికి చివరి ఓవర్లో వికెట్ పడినప్పటికీ ఆ ఓవర్‌ను పూర్తిగా ముగించాల్సిందే. గతంలో వికెట్ పడితే వెంటనే స్టంప్స్ ఎగరేసేవారు.
మ్యాచ్‌లలో కృత్రిమ ఫలితాలను నివారించడానికి జట్లు ఇకపై చివరి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి లేదా ఫోర్ఫిట్ చేయడానికి అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇతర మార్పులలో భాగంగా.. దేశీయ వన్డే మ్యాచ్‌లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్‌లు మైదానంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. అలాగే వికెట్ కీపర్లు బంతిని విసిరే క్షణంలో మాత్రమే తమ గ్లౌవ్స్‌ను స్టంప్స్ వెనుక ఉంచితే సరిపోతుంది. బౌలర్ రన్-అప్ ప్రారంభించినప్పటి నుంచే గ్లౌవ్స్ వెనుక ఉంచాలనే పాత నిబంధన నుంచి కీపర్లకు ఊరట లభించింది.
వచ్చే నెలలో దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానున్న దేశీయ సీజన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే వేర్వేరు నిబంధనలతో నడిచే ఐపీఎల్‌కు ఇవి వర్తిస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

