BCCI Issues Serious Warning: ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ వాడే గాడ్జెట్స్‌పై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం మరింత నిఘా పెంచింది. ముఖ్యంగా రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతుండటంతో.. ప్లేయర్లు ధరించే స్మార్ట్ గ్లాసెస్ సన్‌గ్లాసెస్‌లపై ఐపీఎల్ యాజమాన్యం సరికొత్త ఆంక్షలు విధించింది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు ఉండే పరిమిత ప్రాంతాల్లో ఇలాంటి హైటెక్ వస్తువులను అస్సలు ఉపయోగించకూడదని గట్టిగా హెచ్చరించింది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. కొన్ని కంపెనీలు ఇలాంటి హైటెక్ స్మార్ట్ కళ్లద్దాలను ఐపీఎల్ ఆటగాళ్లకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏసీఎస్‌యూ (ACSU) గుర్తించి, బీసీసీఐని అలర్ట్ చేసింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వైఫై లేదా మొబైల్ డేటా ఉపయోగించి లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చని, టెక్స్ట్ మెసేజ్‌లు పంపవచ్చని, అలాగే ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని తేలింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ డివైజ్‌ల ద్వారా లోపలి సమాచారం బయటకు పొక్కే ప్రమాదం ఉందని (ఫిక్సింగ్ లాంటి మోసాలకు అవకాశం ఉందని) ఐపీఎల్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ లీగ్ క్రెడిబిలిటీ దెబ్బతినకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఎల్ సీజన్ 2026లో ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు, టీమ్ ఓనర్లు, అధికారులు ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించారని, దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా 10 ఫ్రాంచైజీలకు ఎనిమిది పేజీల సుదీర్ఘ ఈమెయిల్ పంపారు. ఇలాంటి పొరపాట్లను నిర్లక్ష్యం చేస్తే ఐపీఎల్ ప్రతిష్టతో పాటు, సదరు ఫ్రాంచైజీల పరువు కూడా పోతుందని ఆయన హెచ్చరించారు.

నిజానికి, ఈ ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ ఒకరు లైవ్ మ్యాచ్ జరుగుతుండగా.. డగౌట్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో బోర్డు అతనిపై చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ గ్లాసెస్ విషయంలో బీసీసీఐ ముందస్తుగా ఆటగాళ్లను హెచ్చరిస్తూ సరికొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story