BCCI:టీమిండియాకు కొత్త స్పాన్సర్ వేటలో బీసీసీఐ
కొత్త స్పాన్సర్ వేటలో బీసీసీఐ

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం బిడ్లను ఆహ్వానించింది. డ్రీమ్ 11 ఇటీవల భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఆన్‌లైన్ మనీ గేమింగ్ వ్యాపారాన్ని మూసివేయడంతో, ఆ సంస్థ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. దీంతో, బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతోంది.
కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది, ఆన్‌లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్, జూదం, క్రిప్టోకరెన్సీ, పొగాకు , మద్యం సంస్థలు బిడ్ చేయడానికి అనుమతించబడవు. అథ్లెటిజర్, స్పోర్ట్స్ వేర్ తయారీదారులు దరఖాస్తు చేసుకోకూడదు. ఇప్పటికే స్పాన్సర్లుగా ఉన్న బ్యాంకులు, ఆర్థిక సేవలను అందించే సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు, కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీలకు చాన్స్ లేదు.
బిడ్ చేసే సంస్థలకు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రూ. 300 కోట్లు సగటు టర్నోవర్ లేదా నికర విలువ ఉండాలి. ఆసక్తి ఉన్న సంస్థలు సెప్టెంబర్ 12 వరకు బిడ్డింగ్ డాక్యుమెంట్లను కొనుగోలు చేయవచ్చు. బిడ్లను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16. టీమిండియా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో ఎలాంటి టైటిల్ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనుంది.
