BCCI: టీమిండియా జెర్సీ స్పానర్స్ షిప్ రేట్లు భారీగా పెంచిన బీసీసీఐ
జెర్సీ స్పానర్స్ షిప్ రేట్లు భారీగా పెంచిన బీసీసీఐ

BCCI: భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌షిప్ రేట్లను బీసీసీఐ గణనీయంగా పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఆన్‌లైన్ గేమింగ్ చట్టం, 2025' కారణంగా డ్రీమ్11 స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలగడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కొత్తగా జెర్సీ స్పాన్సర్‌షిప్ దక్కించుకునే సంస్థలు గతంలో కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ద్వైపాక్షిక మ్యాచ్‌లకు ప్రతి మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు (గతంలో రూ.3.17 కోట్లు), ఐసీసీ, ఏసీసీ టోర్నమెంట్‌లకు ప్రతి మ్యాచ్‌కు రూ.1.5 కోట్లు (గతంలో రూ.1.12 కోట్లు)గా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఆసియా కప్ ముగిసిన తర్వాత అమల్లోకి వస్తాయి. బీసీసీఐ అంచనా ప్రకారం,ఈ కొత్త స్పాన్సర్‌షిప్ ఒప్పందం ద్వారా దాదాపు రూ.400 కోట్లకు పైగా ఆదాయం పొందవచ్చు. అయితే, బిడ్డింగ్‌లో పోటీ పెరిగితే ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కొత్త చట్టం కారణంగా, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ లాంటి సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనడానికి అనర్హులుగా మారాయి. కొత్త స్పాన్సర్ కోసం బిడ్ సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16. దీంతో ఆసియా కప్‌లో భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్ ఉండకపోవచ్చు.
