BCCI Warns IPL Owners: ఐపీఎల్ ఓనర్లకు బీసీసీఐ వార్నింగ్: రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు !
రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు !
BCCI Warns IPL Owners: ఐపీఎల్‌లో నిబంధనల ఉల్లంఘనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉక్కుపాదం మోపనుంది. ఫ్రాంచైజీ యజమానుల తీరుపై బీసీసీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఇకపై రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించింది.
నిజానికి ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్ల యజమానులు డగౌట్‌కు దూరంగా ఉండాలి. అంతేకాదు, మైదానంలో ఉన్న ఆటగాళ్లు లేదా జట్టు సిబ్బందితో మాటల ద్వారా గానీ, సైగల ద్వారా గానీ ఎలాంటి సంప్రదింపులు జరపకూడదు. కానీ, గత కొన్ని రోజులుగా కొందరు యజమానులు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యజమానులు డగౌట్ సమీపంలో తిరుగుతున్న ఫోటోలు సాక్ష్యంగా దొరకడం బీసీసీఐని మరింత ఆగ్రహానికి గురిచేసింది.
ముఖ్యంగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను పట్టించుకోకుండా కొందరు యజమానులు తమ ఫోన్లను కూడా మైదానంలోకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. యాంటీ కరప్షన్ యూనిట్ నిబంధనల ప్రకారం మైదానంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ.. యజమానులు దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో జట్టు యజమానుల ప్రవర్తన ఒకటి. వారు నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా అధికారులకు సహకరించడం లేదు" అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండాలన్నా, అవినీతికి తావు లేకుండా మ్యాచ్‌లు సాగాలన్నా యజమానులు క్రమశిక్షణ పాటించాల్సిందేనని బీసీసీఐ తేల్చి చెప్పింది. వచ్చే సీజన్ నుంచి ఈ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎవరైనా అతిక్రమిస్తే భారీ జరిమానాలు లేదా స్టేడియంలోకి రాకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.



