Indian Premier League: ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర

Indian Premier League: ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం ఎం. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన తన 200వ వికెట్‌ను పడగొట్టారు. తద్వారా ఐపీఎల్‌లో ఈ మైలురాయిని అందుకున్న మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్‌గా భువీ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు భువీ ఆ ఎలైట్ క్లబ్‌లో చేరిన రెండో బౌలర్‌గా నిలిచారు.
స్టైలిష్‌గా మైలురాయిని అందుకున్న భువీ
చెన్నై బ్యాటర్ ఆయుష్ మ్హాత్రే వికెట్‌తో భువనేశ్వర్ ఈ ఘనతను సాధించారు. భువీ వేసిన ఒక షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ షాట్ ఆడేందుకు మ్హాత్రే ప్రయత్నించగా.. బంతి సరిగ్గా కనెక్ట్ కాక మిడ్-ఆఫ్ దిశగా వెళ్ళింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఏమాత్రం తడబడకుండా క్యాచ్ పట్టడంతో భువీ ఖాతాలో 200వ వికెట్ చేరిపోయింది. భువనేశ్వర్ ఇప్పటివరకు 192 మ్యాచ్‌ల్లో 27.25 సగటుతో ఈ వికెట్లు పడగొట్టారు.
టాప్ బౌలర్ల జాబితా ఇదే:
ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ 224 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, భువనేశ్వర్ కుమార్ 200 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. సునీల్ నరైన్ 193 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్న భువీ, ఫాస్ట్ బౌలర్లకు సాధ్యం కాని ఈ రికార్డును అందుకోవడం పట్ల క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

