బాబర్‌పై స్మిత్ సింగిల్ పంతం

Big Bash League: బిగ్ బాష్ లీగ్ లో శనివారం సిడ్నీ సిక్సర్స్ , సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ దిగ్గజం బాబర్ ఆజం మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్ట్రైకింగ్ తన వద్దే ఉంచుకునేందుకు స్మిత్ సింగిల్ తీయడానికి నిరాకరించడంపై బాబర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన మ్యాచ్‌లో 11వ ఓవర్ సమయంలో జరిగింది. సాధారణంగా బీబీఎల్‌లో 4 ఓవర్ల పవర్ ప్లే తర్వాత, మిగిలిన రెండు ఓవర్ల ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్‌ను (పవర్ సర్జ్) ఇన్నింగ్స్ రెండో భాగంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. సిక్సర్స్ జట్టు 11వ ఓవర్‌లో దీనిని ఎంచుకుంది. ఆ సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న బాబర్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా స్మిత్ తన వద్దే ఉంచుకున్నాడు. దీనిపై స్మిత్ స్పందిస్తూ.. "షార్ట్ బౌండరీ వైపు పరుగులు రాబట్టాలనేది నా ప్లాన్. ఆ ఓవర్‌లో 30 పరుగులు చేయాలనుకున్నాను, అనుకున్నట్టుగానే 32 పరుగులు వచ్చాయి. అయితే నేను సింగిల్ తీయకపోవడం బాబర్‌కు నచ్చలేదు" అని పేర్కొన్నాడు.

స్మిత్ వ్యూహం ఫలించి ఆ ఓవర్‌లో రికార్డు స్థాయిలో 32 పరుగులు వచ్చినప్పటికీ, బాబర్ మాత్రం తీవ్ర ఆగ్రహంతో కనిపించాడు. 12వ ఓవర్ తొలి బంతికే బాబర్ అవుట్ కావడంతో అతని సహనం నశించింది. పెవిలియన్ వైపు వెళ్తూ మైదానంలోని కుషన్లను బ్యాట్‌తో కొడుతూ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 39 బంతుల్లో 47 పరుగులు మాత్రమే చేశాడు, అతని స్ట్రైక్ రేట్ కేవలం 120గా ఉండటం విమర్శలకు దారితీసింది.

మరోవైపు స్టీవ్ స్మిత్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. సిడ్నీ సిక్సర్స్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే ఛేదించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్ ఎక్కడా కనిపించకపోవడం, స్మిత్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉండటం చూస్తుంటే, ఇద్దరి మధ్య విభేదాలు ముదిరినట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుత బీబీఎల్ సీజన్‌లో బాబర్ ఆజం ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 28.71 సగటుతో 201 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు అవసరమైన వేగంతో ఆడలేకపోతున్నాడనే విమర్శలు అతనిపై వస్తున్నాయి. పాకిస్థాన్ జాతీయ జట్టులో కూడా ఇదే విధమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న బాబర్, బీబీఎల్‌లో కూడా తన ఫామ్ నిరూపించుకోవడంలో తడబడుతున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story