Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు షాక్.. రికీ పాంటింగ్ టీమ్‌లో ఇద్దరు కోచ్‌ల రాజీనామా
ఇద్దరు కోచ్‌ల రాజీనామా

Punjab Kings: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రికీ పాంటింగ్ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో కీలకమైన ఇద్దరు కోచ్‌లు తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి పంజాబ్ కింగ్స్‌కు ఏర్పడింది. ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ తమ పదవులకు రాజీనామా చేసినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. వీరిద్దరికీ బిగ్ బాష్ లీగ్‌లో కొత్త అవకాశాలు రావడంతో పంజాబ్ కింగ్స్‌ను వీడినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలో సైరాజ్ బహుతులే కూడా పంజాబ్ కింగ్స్‌ను వీడాడు. అప్పటివరకు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఆయన.. భారత పురుషుల క్రికెట్ జట్టుతో చేరాడు. దీంతో ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ నుంచి వైదొలిగిన కోచ్‌ల సంఖ్య మూడుకు చేరింది. కొత్త కోచ్‌ల ఎంపికలో పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ సిఫార్సులు చేయనుంది. అయితే తుది నిర్ణయం మాత్రం హెడ్ కోచ్ రికీ పాంటింగ్దేనని తెలుస్తోంది.
2014 తర్వాత ప్లేఆఫ్స్‌కు చేరడంలోనే ఇబ్బందులు పడిన పంజాబ్ కింగ్స్ పరిస్థితిని పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ మార్చింది. 2025 సీజన్‌కు ముందు పాంటింగ్ జట్టులోకి వచ్చిన వెంటనే పంజాబ్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ఆ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణించి ఫైనల్‌కు చేరింది. అయితే తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి ఎదురైంది. 2026 సీజన్‌లో మాత్రం మంచి ఆరంభం చేసినప్పటికీ చివరికి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 2014లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత వరుసగా పదేళ్ల పాటు పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని కూడా దాటలేకపోయింది. అయితే పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ రాకతో జట్టు ఆటతీరులో గణనీయమైన మార్పు కనిపించింది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి పంజాబ్ కింగ్స్‌లో చేరగా.. శ్రేయస్ అయ్యర్‌ను మెగా వేలంలో రూ.26.75 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఇది ఐపీఎల్ చరిత్రలో ఆ ఫ్రాంచైజీ చేసిన అత్యంత ఖరీదైన కొనుగోలుగా నిలిచింది. బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ చూపించిన అద్భుత ఫామ్‌తో పాటు కెప్టెన్‌గా జట్టుకు మంచి ఫలితాలు అందించడంతో.. ఈ ఏడాది అతడికి భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కాయి. మరోవైపు రికీ పాంటింగ్ ఐపీఎల్‌తో పాటు మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కీలకమైన ఇద్దరు కోచ్‌లు తప్పుకోవడంతో పంజాబ్ కింగ్స్ కొత్త కోచింగ్ బృందాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

