Zaheer Khan Out: లక్నో సూపర్ జెయింట్స్ కు బిగ్ షాక్.. జహీర్ ఖాన్ ఔట్ !
జహీర్ ఖాన్ ఔట్ !

Zaheer Khan Out: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు భారీ షాక్ తగిలింది. వచ్చే ఐపీఎల్ సీజన్-2026కు ముందు ఆ జట్టు మెంటర్, బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన జహీర్ ఖాన్ తన పదవుల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జహీర్ ఖాన్ తన ఒక సంవత్సర కాలపు ఒప్పందం ముగియడంతో లక్నో ఫ్రాంచైజీతో సంబంధాలను తెంచుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ ఫ్రాంచైజీకి, అలాగే వారి అనుబంధ జట్లయిన డర్బన్ సూపర్ జెయింట్స్ (SA20), మాంచెస్టర్ ఒరిజినల్స్ (The Hundred)కు పర్యవేక్షణ కోసం ఒక కొత్త క్రికెట్ డైరెక్టర్‌ను నియమించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జహీర్ ఖాన్ నిష్క్రమణకు ముందు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. IPL 2025లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆ జట్టు 14 మ్యాచ్‌లలో కేవలం ఆరు మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు వెళ్లిన తర్వాత జహీర్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ బాధ్యతలు చేపట్టాడు. గత సీజన్‌లో మోర్నీ మోర్కెల్ నిష్క్రమణతో బౌలింగ్ కోచ్ బాధ్యతలను కూడా జహీర్ ఖానే నిర్వహించాడు. ఈ మార్పులు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కొత్త వ్యూహాలకు, మార్పులకు నాంది పలుకుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే సీజన్ కోసం జట్టు యాజమాన్యం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
