Big Shock for Team India: టీమిండియాకు బిగ్ షాక్: తిలక్ వర్మకు ఎమర్జెన్సీ సర్జరీ
తిలక్ వర్మకు ఎమర్జెన్సీ సర్జరీ

Big Shock for Team India: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మకు బుధవారం (జనవరి 7) అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రాజ్‌కోట్‌లోని గోకుల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయనకు టెస్టిక్యులర్ టార్షన్ అనే తీవ్రమైన సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమించకుండా వైద్యుల సూచన మేరకు వెంటనే ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తిలక్ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం 3 నుండి 4 వారాల సమయం పడుతుందని సమాచారం. జనవరి 21 నుండి ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుండి తిలక్ వర్మ తప్పుకున్నట్టే. టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి కేవలం నెల రోజులే సమయం ఉండటంతో, తిలక్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. గతేడాది జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 53 బంతుల్లో 69* పరుగులు చేసి భారత్‌ను విజేతగా నిలపడంలో తిలక్ కీలక పాత్ర పోషించారు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగిన ఆయన లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అని చెప్పవచ్చు. తిలక్ వర్మ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నివేదికల ప్రకారం, టీ20 ప్రపంచకప్ జట్టులో లేని శుభ్‌మన్ గిల్ పేరును రీప్లేస్‌మెంట్‌గా పరిగణించే అవకాశం తక్కువని తెలుస్తోంది. సెలక్టర్లు శ్రేయస్ అయ్యర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిలక్ వర్మ త్వరగా కోలుకుని ప్రపంచకప్ నాటికి జట్టులోకి తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

